శేకూరు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శేకూరు చానెల్ పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం మంగళవారం పరిశీలించారు. జలధార–జలహారతి కార్యక్రమం, ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు బాగా తక్కువగా ఉన్న గ్రామాల్లో శేకూరు ఒకటి. ఇంకుడు గుంతల ఏర్పాటుకు అవకాశం ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించి పనులు చేపట్టేలా చూడాలన్నారు. వర్షాకాలం నాటికి జిల్లాలో గుర్తించి చేపడుతున్న చెరువు పనులను పూర్తి చేసి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
నృసింహుని ఆలయంలో ‘ఆక్టోపస్’ మాక్‌డ్రిల్
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్‌డ్రిల్ నిర్వహించాయి. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆలయం వద్ద ఏదైనా దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులను ఏవిధంగా రక్షించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఉగ్రవాదులు ఆలయంలోని జొరబడితే ఎంత వేగంగా వారిని అదుపులోకి తీసుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. కమాండోలు ఉగ్రవాదులను తుదముట్టించే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కె. రామచంద్రమూర్తి, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ శివాజీ పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్దరు మహిళా పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని మంగళవారం తెలిపారు. మంగళగిరి పట్టణ పరిధిలోని వారి కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఈనెల 15 –20వ తేదీ వరకు జరిగిన నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో క్రీడాకారులు బి.లిఖిత, వినయశ్రీ బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లిఖిత, వినయశ్రీలతోపాటు చైనాలో జరిగిన ఏషియన్ సబ్‌జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన షానూన్‌ను కూడా అభినందించారు. సంఘం కోశాధికారి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు చంద్రిక, భాస్కరరావు పాల్గొన్నారు.
సత్తెనపల్లి: జీవిత ఖైదీ పరారైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ జైలులో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు అరండల్‌పేటలో గతంలో జరిగిన హత్య కేసులో తమ్మినేని శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్నాడు. అతడు నెల్లూరు జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతని సత్ప్రవర్తనతో నెల్లూరు జైలు నుంచి ఓపెన్ జైలులో భాగంగా సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. సత్తెనపల్లిలోని సబ్ జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్‌పీసీఎల్ పెట్రోలు బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పరారయ్యాడు. దీనిపై సబ్‌జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


