సీసీఎల్‌ఏ సమీక్ష సమావేశంలో
ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ
నరసరావుపేట: జిల్లాలో రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ, ఈ–కేవైసీ ప్రక్రియ, వెబ్‌ల్యాండ్ పోర్టింగ్, రెవెన్యూ వన్ డిజిటౖలైజేషన్ కార్యక్రమాలను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో పెండింగ్‌లో ఉన్న అంశాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీ సర్వే పనులు పారదర్శకంగా, కచ్చితత్వంతో చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసు, ఫీల్డ్ హాజరు, 9(2) నోటీసు, డ్రాఫ్ట్ పట్టాదారు పాస్‌బుక్ ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని అధికారులను ఆదేశించారు.


