రొంపిచర్ల: రొంపిచర్ల మాజీ సర్పంచ్ పడాల వెంకిరెడ్డి (82) మంగళవారం మృతి చెందారు. ఆయన గత కొద్దిరోజులుగా విపరీతంగా కాస్తున్న ఎండలకు అస్వస్థతకు గురై, వడదెబ్బ తగిలి నరసరావుపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గ్రామ సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
విద్యుత్ స్తంభంపై నుంచి పడి కార్మికుడు మృతి
రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గోనె గోపి (22)అనే కార్మికుడు విద్యుత్ లైన్ మరమ్మతుల సమయంలో స్తంభంపై నుంచి కిందపడి మృతి చెందాడు. రొంపిచర్లలోనీ రాజుల బజారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. గోపి విద్యుత్ స్తంభం మీద ఉండగా విద్యుత్ షాక్ భయంతో కిందపడి పోయాడు. కింద పడిన గోపి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు గోపి జార్ఖండ్ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వలస వచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్తా చాటిన స్వర్ణ మైసూరు ఎడ్ల జత
స్వర్ణ(కారంచేడు): రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు ఆకట్టుకున్నాయి. మండలంలోని స్వర్ణ గ్రామంలో స్వర్ణమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా స్వర్ణ–దగ్గుబాడు రోడ్డులోని గ్రామ సచివాలయం (పార్కు) సమీపంలో రాష్ట్రస్థాయి మైసూర్ ఎడ్ల బండలాగుడు పందేలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన రామాంజనేయులుకి చెందిన మైసూర్ ఎడ్ల జత ఈ ఏడాది ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. పోటీల్లో 14 ఎడ్ల జతలు తమ పేర్లు నమోదు చేసుకోగా ఎండల కారణంగా కేవలం 10 ఎడ్ల జతలు మాత్రమే పాల్గొన్నాయి. మొదటి స్థానం పొందిన రామాంజనేయులు ఎడ్ల జత నిర్దేశించిన 15 నిమిషాల సమయంలో 2498 అడుగుల దూరం లాగి గమ్యం చేరుకున్నాయి. తరువాత రెండో స్థానంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామానికి చెందిన మందుల నజీర్, మందుల ఖాజావలీలకు చెందిన ఎడ్ల జత 2400 అడుగుల దూరం లాగాయి. మూడో స్థానాన్ని కూడా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన ఉప్పు పండుకు చెందిన ఎడ్ల జత 2195 అడుగుల దూరం లాగాయి. నాలుగో బహుమతిని చీరాల–పేరాలకు చెందిన ఎడ్ల జత 2100 అడుగుల దూరం లాగాయి. విజేతల యజమానులకు ప్రథమ బహుమతిని గ్రామానికి చెందిన పగడాల బసవయ్య, సుబ్బారావులు రూ.20 వేలు, రెండో బహుమతిని రూ.15 వేలను కేళం శివరామకృష్ణప్రసాద్ అందించారు. మూడో బహుమతిని రూ.10 వేలు కటికి శింగయ్య, కొండే వెంకటేష్‌లు అందించారు. నాలుగో బహుమతిని రూ.5 వేలను ఎర్రిబోయిన రామాంజనేయులు అందించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా శివరామకృష్ణప్రసాద్, కట్టా ప్రసాద్, పూల గోపిలు వ్యవహరించారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎడ్ల జతలు పాల్గొన్నాయి.
108లో ప్రసవం..
తల్లీబిడ్డ క్షేమం
రేపల్లె: అత్యవసర పరిస్థితుల్లో తరలిస్తున్న గర్భిణికి 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. వైద్య సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో తల్లి, శిశువు సురక్షితంగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. రేపల్లె మండలం లంకెవానిదిబ్బకు చెందిన చెందిన గర్భిణి నంబూరి అంకమ్మ (23)కు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఇది రెండో గర్భం కాగా, ఏడో నెలలోనే నొప్పులు అధికమవడంతో వైద్యులు పరిశీలించారు. మొదటి కాన్పు శస్త్రచికిత్స ద్వారా జరగడం, ప్రస్తుతం రక్తహీనత ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 108 వాహనంలో అంకమ్మను తెనాలికి తరలించే ఏర్పాట్లు చేశారు. వాహనం రేపల్లె – పెనుమూడి హైవేకు చేరుకున్న సమయానికే అకస్మాత్తుగా నొప్పులు ఎక్కువ అయ్యాయి. పరిస్థితి విషమంగా మారుతుండటాన్ని గమనించిన ఈఎంటీ కేసన మహేష్ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. అంకమ్మ సురక్షితంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని తెనాలి హాస్పిటల్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించారు.


