గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో రవాణా వాహనం.. కారు ఢీకొని 8 మందికి గాయాలైన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. మేడికొండూరుకు చెందిన టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణ తన క్లీనర్ లింగాల నరసింహారావుతో కలసి టాటాఏసీ వాహనంలో విజయవాడ వెళుతున్నారు. ఈ క్రమంలో టాటాఏసీ బుడంపాడు సమీపంలోని సత్యసాయిబాబా ట్రస్ట్ ప్రాంతంలో ఎన్‌హెచ్ 16 వైవేలో వెళుతుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని గాల్లోకి లేచి అవతలవైపు రోడ్డుపై పడింది. ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ తీవ్రగాయాలపాలవ్వగా, అదే సమయంలో విజయవాడ నుంచి బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన షేక్ జాఫర్‌సాదిక్, అతడి భార్య గౌషార్‌సుల్తాన్, కుమారుడు నవాజ్‌షరీఫ్, కుమార్తె వజీహాసుల్తానా, బావ సయ్యద్ మహబూబ్‌హుస్సేన్, షేక్ మామానాజిన్ ఆరుగురు కారులో వేటపాలెంకు వెళుతున్నారు. అదేసమయంలో రోడ్డు అవతలవైపునుంచి టాటాఏసీ వాహనం కారు ముందు సడన్‌గా పడటంతో కారు టాటాఏసీ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారులోని ఆరుగురు గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళుతున్న ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన వాహనాలను ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇరువురు యువకులకు స్వల్ప గాయాలు కాగా వారు తమ వాహనం తీసుకుని వెళ్లిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురిని, టాటాఏసీలోని ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదంలేదని టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణకు తీవ్రగాయాలవ్వటం వలన పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈదురు గాలులకు గాల్లోకి ఎగిరిన సోలార్ ప్లేట్లు
ఇద్దరు చిన్నారులపై పడి గాయాలు
చిలకలూరిపేటటౌన్: ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని దండమూడి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి సోలార్ ప్లేట్లు గాల్లోకి ఎగిరి అక్కడే ఉన్న మూడేళ్ల కౌశిక్, పదేళ్ల తరుణ్‌లపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్నారుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
విత్తన దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
ప్రత్తిపాడు: మిర్చి విత్తనాలు విక్రయించే దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని కర్షక్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మంగళవారం రాత్రి స్థానిక ఏవో సునీతతో కలిసి గుంటూరు విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్, ఎస్‌ఐ లక్ష్మీ మాధవిలు తనిఖీలు చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, సరైన పత్రాలు చూపించక పోవడంతో సుమారు రూ.45 లక్షల విలువ చేసే మిర్చి సూపర్– 10 రకం విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు. విత్తనాల నమూనాలు సేకరించారు.
గాయాలపాలైన షేక్ జాఫర్ సాధిక్,
గౌషార్ సుల్తానా
తీవ్రగాయాలైన డ్రైవర్ శివరామకృష్ణ


