ఒడిశాలో కొనుగోలు..
నగరంపాలెం(గుంటూరు): గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దుగ్గిరాల పీఎస్ పరిధిలో రెండు వారాల క్రితం మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్లతో గంజాయి వినియోగదారులైన గండికోట నాగేంద్ర, కోటేశ్వరరావులకు పరీక్షలు చేయించారని చెప్పారు. వారిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రుజువైందన్నారు. దీంతో మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్ ఎస్‌ఐ వెంకటరవి నేతృత్వంలో ఇద్దరిని విచారించగా, మొత్తం 12 మంది ఉన్నారని వెల్లడైందని అన్నారు. ఐదుగురు గంజాయి తాగి, విక్రయాలు, సరఫరా చేసేవారని, మిగతా ఏడుగురు తాగేవారని చెప్పారు. ఈ క్రమంలో 12 మందిని దుగ్గిరాల లాకుల వద్ద అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దుగ్గిరాల బంగ్లా సెంటర్‌లో ఉంటున్న దగ్గుబాటి రాజశేఖర్ అలియాస్ చంటిపై దుగ్గిరాల, తెనాలి మూడో పట్టణ పీఎస్‌లో గంజాయి కేసులు, ఎన్‌బీడబ్ల్యూ పెండింగ్‌లో ఉందన్నారు. పంజగల మునీంద్ర, షేక్‌నాగూర్‌బాబు (తెనాలి, పాండురంగపేట)పై తెనాలి మూడో పట్టణ పీఎస్‌లో గంజాయి, పేకాట, చోరీ కేసులు, ఏమినేని లక్ష్మీనారాయణపై దుగ్గిరాల పీఎస్‌లో రౌడీషీట్, గంజాయి కేసు, విజయవాడ రెండో పట్టణ పీఎస్‌లో దోపిడీ కేసులున్నాయని చెప్పారు. యార్లగడ్డ శశాంక్, గంజాయి వినియోగదారులైన వట్టిప్రోలు చక్రవర్తి(దుగ్గిరాల పీఎస్‌లో గంజాయి కేసు), ప్రస్తుతం పెదకాకాని నంబూరు గ్రామంలో ఉంటున్న ఈమని గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమా(దుగ్గిరాల పీఎస్‌లో గంజాయి కేసు), గండికోట నాగేంద్రబాబు, జముడుగాని కోటేశ్వరరావు అలియాస్ సత్తిపండు(దుగ్గిరాల పీఎస్‌లో గంజాయి కేసు), తెనాలి చినరావూరుకి చెందిన షేక్ నజీముద్దీన్ అలియాస్ నయూం, పఠాన్ ఇస్మాయిల్, కుందర చందులను అరెస్ట్ చేశారని అన్నారు. వీరి నుంచి 2.5 కిలోల గంజాయి, రూ.2 వేలు, మోటారు సైకిల్ సీజ్ చేశారని చెప్పారు.
దగ్గుబాటి రాజశేఖర్ ఒడిశాలోని కోరాపుట్ వెళ్లి గంజాయి కొనుగోలు చేసేవాడని అన్నారు. తద్వారా మునీంద్ర, నాగూర్‌బాబు, లక్ష్మీనారాయణ, శశాంక్‌లకు విక్రయించేవారు. వీరు గంజాయి తాగి, దుగ్గిరాల, ఈమని, రేవేంద్రపాడు గ్రామాల్లో యువకులకు విక్రయించేవారు. విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేసేవారని పేర్కొన్నారు. కేసు ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్‌ఐ ఎస్.వెంకటరవి, హెచ్‌సీ ఎం.కోటేశ్వరావు, కానిస్టేబుళ్లు డి.మరియకుమార్, అబ్దుల్‌ఫరీద్, కె.విజయ్ కుమార్, వై.సాంబయ్య, హోంగార్డు షేక్ సైదాలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు.


