నాదెండ్ల: నాటకాలు, నాటికలు అంతరించిపోతున్న ప్రస్తుత రోజుల్లో నాలుగేళ్లుగా జాతీయస్థాయి నాటికల పోటీలు నిర్వహించటం అభినందనీయమని ప్రముఖ కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ చెప్పారు. నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో సాతులూరు గ్రామంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు మంగళవారం మూడోరోజు ఆసక్తిగా జరిగాయి. ప్రముఖ కళాకారులు ముత్తవరపు సురేష్, ఎన్టీఆర్ పురస్కార గ్రహీత, రంగస్థల సినీనటుడు, దర్శకుడు నాయుడు గోపి, పాటిబండ్ల సాంబశివరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు, ప్రభు ధనుంజయ్, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు హాజరయ్యారు. ● చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వంలో అట్టాడ అప్పలనాయుడు రచించిన విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి చిటికెన వేలు, పాగర్తి నాగేశ్వరరావు దర్శకత్వంలో సుఖమంచి కోటేశ్వరరావు రచించిన గుంటూరు శ్రీ రమణా కళానిలయం వారి మాతృత్వం, జీవీ మనోహర్ దర్శకత్వంలో కేవీవీ సత్యనారాయణ రచించిన పొన్నూరు శ్రీ విశ్వకళా చైతన్యవేదిక వారి సూక్తం నాటికలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రసభరితంగా సాగిన నాటికలు, కళాకారుల ప్రదర్శనలతో ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో కోలాహలంగా సాగా యి. అనంతరం నిర్వాహకులు బండారుపల్లి సత్యనారాయణ, నడింపల్లి వెంకటేశ్వరరావు, జరుగుల రామారావు, చెరుకూరి సాంబశివరావులు అతిథులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు.


