గుట్టచప్పుడు కాకుండా.. | - | Sakshi
Sakshi News home page

గుట్టచప్పుడు కాకుండా..

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

మాచర్లలో గుట్టలు తవ్వేస్తున్న అక్రమార్కులు భారీగా తవ్వకాలు

కలెక్టర్‌కు

టీడీపీలోని ఓ వర్గం ఫిర్యాదు

నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతో చెలరేగిపోతున్న మట్టి మాఫియా

పట్టించుకోని అధికారులు

ప్రశ్నిస్తే సొంత పార్టీ నేతలను సైతం వేధిస్తున్న వైనం

కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేయడంతో నామమాత్రంగా తనిఖీలు

అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన టీడీపీలోని ఓ వర్గం

మాచర్లలో గుట్టలు తవ్వేస్తున్న అక్రమార్కులు
భారీగా తవ్వకాలు

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ సంపదల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రావెల్‌ మాఫియా నిత్యం వందలాది ట్రక్కుల మట్టిని అక్రమంగా తరలించి రూ.కోట్లు దోచుకుంటోంది. నియోజకవర్గంలోని గుట్టలు, చెరువులు, ప్రభుత్వ బీడు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా తవ్వేస్తు జేబులు నింపుకొంటున్నారు. అడ్డుకోవాల్సిన ప్రభుత్వాధికారులు పట్టించుకోకపోవడంతో సహజవనరులను కాపాడేవారు లేకుండా పోతున్నారు. తాను ధర్మాత్ముడని చెప్పుకొనే ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే మట్టి దోపిడీ జరుగుతుండటంతో తామేమి చేయలేమని అధికార యంత్రాంగం చేతులెత్తేస్తోందట. మరోవైపు మట్టి మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో అధికారపార్టీ పెంచి పోషిస్తున్న రౌడీ గ్యాంగ్‌ కాపాలకాస్తుండటంతో ఆ దిశగా చూడటానికి సైతం ప్రజలు, అధికారులు భయాందోళనకు గురవుతున్నారు.

పట్లవీడు, ఆత్మకూరులో యథేచ్ఛగా..

మాచర్ల నియోజవర్గంలోని దుర్గి, వెల్దుర్తి, మాచర్ల రూరల్‌ మండలాల్లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా దుర్గి మండలంలోని అడిగొప్పల సమీపంలోని ఆత్మకూరు చెరువు సుమారు 800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ మట్టిపై కన్నేసిన టీడీపీ ప్రజాప్రతినిధి బృందం నిత్యం వందలాది టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. ఇటుకలు, వ్యవసాయ, రియల్‌ ఎస్టేట్‌ అవసరాల కోసం ఆత్మకూరు చెరువు మట్టికి బాగా డిమాండ్‌ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని స్థానిక టీడీపీ నేతను ముందుపెట్టి ప్రజాప్రతినిధి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇదే చెరువుపై ఆశపెట్టుకున్న కొందరు టీడీపీ నేతలను బెదిరించి మట్టి తవ్వకాలు చేస్తుండటంతో స్థానికులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు వెల్దుర్తి మండలం పట్లవీడు చెరువులో సైతం భారీఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక నేతను ఒకర్ని ముందుపెట్టి మట్టి తవ్వకాలు జరుపుతున్నా డబ్బులు నేరుగా ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్తున్నాయని, నాదేముందని చెడ్డపేరు తప్ప అని సదరు చోటా నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.

సొంతపార్టీ నేతలకూ బెదిరింపులు...

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆశించిన మాచర్ల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనంలో ఉన్నారు. మట్టి, రేషన్‌, గ్రానైట్‌ ఇలా అన్ని అక్రమార్జనలు ప్రజాప్రతినిధి నేతృత్వంలో చేస్తుండటంతో మాకేం దక్కుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా ఆత్మకూరు, పట్లవీడు, కొత్తపల్లిలో మట్టి తవ్వకాలలో స్థానిక నేతలు కూటమి గా ఏర్పడి మట్టి తవ్వకాలు చేపడదామని అనుకున్నారు. కొంత గ్రామ అవసరాలకు, మరికొంత పార్టీకి పనిచేసిన నేతలు తీసుకుందామని ఆశించారు. అది వీలుకాకపోవడంతో తీవ్ర అసహనంలో ఉన్న ఓ స్థానిక నేత మట్టి అక్రమ తవ్వకాలపై ప్రశ్నించి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నేరుగా సదరు ప్రజాప్రతినిధి తాను పార్టీకి చాలా ఖర్చుచేశానని, మట్టి అక్రమార్జనలో అడ్డువస్తే సహించనని బెదిరించడంతో అవాక్కయ్యాడు. దీని కోసమా మేము టీడీపీలో పనిచేసిందని వాపోతున్నారట. ఇదే విషయంపై ఉన్నతాధికారులతోపాటు టీడీపీ అధిష్టానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారట. తమ సామాజికవర్గానికి చెందిన ఓ ఎంపీ, ఎమ్యెల్యేల ద్వారా ఇప్పటికే అధిష్టానానికి తమ గోడును నివేదికల రూపంలో వెల్లడించినట్టు చెప్పుకొస్తున్నారు.

మట్టి అక్రమ తవ్వకాలలో ముఖ్యనేత ఒంటెత్తు పోకడలపై విసిగిపోయిన టీడీపీ అసమ్మతి నేతలు నేరుగా పల్నాడు జిల్లా కలెక్టర్‌కు ఎద్దులబోడులో జరుగుతున్న మైనింగ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈనెల 22న కొత్తపల్లి గ్రామంలో గల ఎద్దులబోడును మైనింగ్‌ అధికారి సుధాకర్‌, వీఆర్వో షేక్‌ ఖాజావలి, గ్రామ సర్వేయర్‌ కసిన్యాక్‌లు తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం ఉండటంతో ఆసమయంలో మట్టి తవ్వకాలు నిలిచిపోవడంతో మట్టి తవ్విన గోతులను అధికారులు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులు ఇస్తామని వెళ్లిపోయారు. దీంతో పది రోజులుగా తాత్కాలింగా మట్టి అక్రమ తవ్వకాలు ఆగిపోయాయి. ఈ విషయంపై అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మాచర్ల నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడిని వెంటనే అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

మాచర్ల రూరల్‌ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో ఎద్దులబోడులో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరిగాయి. తాను అవినీతిని సహించనని గొప్పలు చెప్పే సదరు ప్రజాప్రతినిధే ఈ మట్టి తవ్వకాలు జరిపిస్తున్నట్టు ఆ పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. 20 ఏళ్లపాటు తాము కష్టపడి టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తే ఎన్నికల ముందు వచ్చిన వారు దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇందులో భాగంగా ఎద్దులబోడు మైనింగ్‌పై స్థానిక నేతలు మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి, అతని గూండాలకు భయపడి స్థానిక అధికారులు అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement