కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకల ద్వారా రూ.7,65,584ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకలను భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరిపారు. 114రోజులకు గాను లెక్కింపు జరిపామని, గతం కంటే రూ.95,546లు అధిక ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. పొన్నూరు హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఎం.గోపి, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు అధ్యక్షుడు కలకోట చక్రధర్‌రెడ్డి, సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను సోమవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను సందర్శించిన రంజిత్ బాషా సీటింగ్ ఏర్పాట్లతో పేస్టు సీసీ టీవీల పనితీరు, విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వేసవి తాపం దృష్ట్యా పరీక్షల సమయంలో విద్యార్థులకు, సిబ్బందికి చల్లని తాగునీటిని అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐవో జి.సునీత, డీఈసీ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు కేటాయించిన 16,812 మంది విద్యార్థుల్లో 15,396 మంది హాజరయ్యారు.
విజయపురిసౌత్: కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ కుడికాలువకు తాగునీటిని అధికారులు సోమవారం విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్ట్ ఈఈ రమేష్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ కుడికాలువకు మొత్తం 10 టీఎంసీల నీటిని 15 రోజులపాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కుడి కాలువ గేట్ల ద్వారా 6000 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపుకొని తాగునీటి అవసరాల నిమిత్తం వాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్ట్ గేట్స్ డీఈ శ్రీకాంత్, ఏఈఈ సుధా, డ్యాం సిబ్బంది యాంపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలు
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి వెళ్లే కాలువ కట్ట వద్ద సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నా యి. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామం నుంచి చండ్రాజుపాలేనికి చెందిన మిరప కూలీలతో వాహనాన్ని పాకాలపాడు నుంచి ఎదురుగా వస్తున్న థమ్‌సప్ కూల్‌డ్రింక్ లోడుతో వస్తున్న ఆటో ఢీకొంది. మిరప కూలీలు ఇరువురు పిల్లలు, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇరువురు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


