ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం
గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్షలు నేరం
సత్తెనపల్లి: పుట్టబోయే బిడ్డ ఆడ అయినా, మగ అయినా సమానమే. సమాజంలో ఇద్దరికీ భేదం లింగపరమైనదే తప్ప ఆధునిక జీవన విధానంలో వ్యత్యాసం లేదు. వైద్య రంగంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో కడుపులోని బిడ్డ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోగలుగుతున్నాం. బిడ్డ ఎదుగుదలలో సమస్యలు తలెత్తితే సరిచేసే చికిత్స పద్ధతులుండనే ఉన్నాయి. అందుకోసం రూపుదిద్దుకున్న సాంకేతికతను కడుపులోని బిడ్డ లింగ నిర్ధారణ కోసం ఉపయోగిస్తే నేరమవుతుంది. గర్భస్థ పిండ లింగ నిర్ధా రణ నిషేధ (పీసీపీఎన్‌డీటీ) చట్టం పటిష్ట అమలుకు కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభు త్వం లింగ నిర్ధారణ పరీక్షల కట్టడిపై అధికారులను అప్రమత్తం చేసింది. ఇటీవల జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పీసీపీఎన్‌డీటీ చట్టం పటిష్ట అమలుకు ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
పటిష్ట చట్టం అండ
భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 1994లో ప్రీ కన్సప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్(పీసీపీఎన్‌డీటీ) చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు చేయడం నేరం. ప్రభుత్వం వద్ద లైసెన్స్ పొందిన స్కానింగ్ సెంటర్లు నిబంధనలను మీరితే చర్యలు తీసుకుంటుంది. అల్ట్రా సౌండ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరం. అలా చేస్తే స్కానింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు అవ్వడంతో పాటు వైద్యులపై కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే వైద్య పట్టా రద్దు చేయడంతో పాటు, మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. చట్టం అమల్లో భాగంగా డెకాయ్ ఆపరేషన్ పేరుతో మూడు నెలలకు ఒకసారి స్కానింగ్ సెంటర్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
పుట్టబోయే బిడ్డ మగ, ఆడ ఎవరనేది లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం. ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు శ్రేయస్కరం. మాతా శిశు సంరక్షణ సేవలు నాణ్యతతో అందిస్తున్నాం.
–డాక్టర్ బి.రవి, డీఎంహెచ్‌ఓ


