● ఒకరు 36 కేసుల్లో నిందితుడు కాగా, మరొకరు 41 కేసుల్లో.. ● రాష్ట్రంతోపాటు కర్ణాటకలోనూ చోరీలు | - | Sakshi
Sakshi News home page

● ఒకరు 36 కేసుల్లో నిందితుడు కాగా, మరొకరు 41 కేసుల్లో.. ● రాష్ట్రంతోపాటు కర్ణాటకలోనూ చోరీలు

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

● ఒకరు 36 కేసుల్లో నిందితుడు కాగా, మరొకరు 41 కేసుల్లో.. ● రాష్ట్రంతోపాటు కర్ణాటకలోనూ చోరీలు

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

చిలకలూరిపేట: వివిధ దొంగతనం కేసుల్లో నిందితులైన ఇరువురు అంతరాష్ట్ర దొంగలను చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ పి.రమేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని బ్యాంకు కాలనీకి చెందిన జయరామ్‌ విజయలక్ష్మి ఈ ఏడాది జనవరి మూడోతేదీన ఆర్యవైశ్య కళ్యాణమండపం ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పూజల కోసం వచ్చారు. పూజల అనంతరం ఆమె బంధువైన శ్రీనివాసరావు మోటార్‌ సైకిల్‌పై బ్యాంకు కాలనీ మెయిన్‌రోడ్డు వద్ద వదిలివెళ్లాడు. ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న విజయలక్ష్మిని వెనుకగా బైక్‌పై ముఖానికి మాస్కు ధరించి వచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం, విజయనగర్‌కాలనీకి చెందిన షేక్‌ కృపారావు, ఎలియాస్‌ బాషా ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. అనంతరం దొంగించిన చైన్‌ను తన మిత్రుడైన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన మల్లెల కొండారెడ్డి వద్ద దాచి కర్ణాటకకు వెళ్లిపోయాడు. కర్నాటకలోని చిత్రదుర్గ, గౌరీబీదానూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, చైన్‌ స్నాచింగులకు పాల్పడి జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి చిలకలూరిపేటకు రాగా ఆర్టీసీ బస్‌స్టేషన్‌ వద్ద ఇరువురిని పట్టణ ఎస్‌ఐ వి.సోమేశ్వరరావు అరెస్టు చేసి వారి వద్ద నుంచి దొంగతనానికి గురైన చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొదటి నిందితుడైన షేక్‌ కృపారావు అలియాస్‌ బాషాపై ఏపీతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కలిపి 36 కేసులు ఉండగా, రెండో నిందితుడు కొండారెడ్డిపై 41 కేసులు ఉండటం విశేషం. పట్టణ ఎస్‌ఐ పి.హజరతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement