నరసరావుపేట: కోస్టల్ బ్యాంక్ ప్రతినిధులు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నుంచి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.50వేలు విరాళంగా అందించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహను కలిసి చెక్కును అందజేశారు. ఈ నిధిని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. కోస్టల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, చంద్రశేఖరకుమార్, డిప్యూటీ మేనేజర్ జె.అరవింద్, జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి ఆర్.గుణశీల పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు అన్నారు. పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్, ఎన్‌సీడీ, హీట్ వేవ్స్, జాతీయ ఆరోగ్య కార్యక్రమములపై సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు మాట్లాడుతూ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రియాంక, శివ సాంబి రెడ్డి, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నెహ్రూనగర్: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంఎస్‌ఎంఈల పాత్ర కీలకమని గుంటూరు జిల్లా డీఆర్‌డీఏ జీవనోపాధుల మేనేజర్ డాక్టర్ టి అశోక్‌కుమార్ తెలియజేవారు. కొత్తపేటలోని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఆర్‌డీఏ బ్యాంకు రుణాల మేనేజర్ కేశవ మాట్లాడారు. ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీ విధానం, బ్యాంకు రుణాలు పొందే ప్రక్రియ, రుణాల చెల్లింపు విధానాలపై అవగాహన కల్పించారు. ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ టి సందీప్‌బాబు మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్స్, తక్కువ వ్యయంతో స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకునే మార్గాలపై సూచనలు చేశారు.
రూ.24.78 లక్షల విత్తనాలు స్వాధీనం
నగరంపాలెం(గుంటూరువెస్ట్): నగర పరిధిలోని విత్తన దుకాణంలో సోమవారం గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి డి.సూర్యశ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. ఏటుకూరు రోడ్డులోని వాసవి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పరిశీలించగా, రికార్డులు సరిగాలేకపోవడం, విత్తనాల తయారీకి వాడే ప్రాసెసింగ్, ప్యాకింగ్ లైసెన్‌న్స్ పొందకపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఐదు రకాల విత్తనాలైన సూపర్ బిబి–11 గోల్డ్, సూపర్ యమునా గోల్డ్ 1904, వరి, ప్రాసెస్ చేయబడిన/ రసాయన పూత పూసిన వరి(వదులుగా ఉన్నవి), ప్రాసెస్ చేయబడని/ శుద్ధి చేయని వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.24.78 లక్షల విలువ చేసే 26,791 కిలోల విత్తనాలు అని అధికారులు తెలిపారు.


