సాయిసాధన బాఽధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాధితులు తట్టుకోలేక క్రిమిసంహారక మందు సేవించిన బాధితుడు లక్ష్మీనారాయణ ఏడాదికి సిట్ పేరుతో కాలయాపన
నరసరావుపేట టౌన్: ప్రభుత్వం సాయిసాధన చిట్‌ఫండ్ బాధితులకు న్యాయం చేయటంలో తీవ్ర అలసత్వం వహిస్తుండటంతో బాధితుల్లో ఒకరు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాసనగర్‌కు చెందని పాలపర్తి లక్ష్మీనారాయణ సాయిసాధన చిట్‌ఫండ్‌లో రెండు రూ.40 లక్షల చీటిపాటల్లో సభ్యుడిగా ఉన్నాడు. పాటమొత్తం అయిపోగా డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో గతేడాది ఫిబ్రవరి నెలలో చిట్‌ఫండ్ నిర్వహకుడు సాయిసాధన పుల్లారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చిట్‌ఫండ్‌తోపాటు అప్పుల రూపంలో సుమారు రూ.400 కోట్ల వరకు సేకరించి ఉడాయించినట్టు తేలింది. ఈ మేరకు బాఽధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అదేవిధంగా గుంటూరుకు చెందిన మహీ అగ్రీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దండా రాజ్యలక్ష్మి రియల్ ఎస్టేట్‌లో రూ.11.62 కోట్లు పెట్టుబడులు పెట్టించి పుల్లారావు మోసం చేశాడని ఆమే ఇచ్చిన ఫిర్యాదుతో పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాఽధితులంతా రోడ్డెక్కి ఆందోళన చేపడ్డంతోపాటు ముఖ్యమంత్రి, హోంమంత్రిలను కలసి వినతిపత్రాలను అందజేశారు. స్పందించిన ప్రభుత్వం కేసును ఏడాది క్రితం సీఐడీకి అప్పగించింది. బాపట్ల ఎస్పీతో కలిపి సిట్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నంంచి కేసును పక్కనపడేశారు. నేటికి బాధితులకు న్యాయం జరగలేదు. న్యాయస్థానం ద్వారా బెయిల్ పొందని నిందితుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. న్యాయం కోసం అధికారుల చుట్టూ బాధితులు తిరిగి తిరిగి విసిగిపోయారు. ఒకవైపు బాధితులకు ఆర్థికసమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు న్యాయం జరుగుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది పుల్లారావు బాధితులు ఇప్పటికే ఊర్లను వదలిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా పాలపర్తి లక్ష్మీనారాయణ క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సీజ్ చేసిన పుల్లారావు ఆస్తులను విక్రయించి వచ్చిన నగదునున అందరికి అందజేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


