పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

శ్రీఅగ్ని ఎంఎస్‌ఎంఈ పార్కుకు వర్చువల్‌ విధానంతో శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో హాజరైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

యడ్లపాడు: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ద్వారానే వేగవంతమైన, సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. కొండవీడు రెవెన్యూ పరిధిలోని కాటూరి మెడికల్‌ హాస్పిటల్‌ వెనుక ఏర్పాటుచేసే శ్రీ అగ్ని ఎంఎస్‌ఎంఈ పార్క్‌ కార్యక్రమంలో వారు స్థానికంగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజయవాడలో జరిగిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌–2026 వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పార్కు పనుల్ని వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాల సహాయంతో స్వయంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

నియోజకవర్గంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఈ పార్కు స్థానిక నిరుద్యోగ యువతకు ఒక వరం లాంటిదని, ఇక్కడ లభించే ఉపాధి అవకాశాలలో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యత ఇచ్చేలా పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశిస్తామని పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రాంతంలో జిన్నింగ్‌, నూలు మిల్లులు, సుగంధ ద్రవ్యా రంగాల ద్వారా రూ.5 వేల కోట్ల వ్యాపార లావాదేవీలతో దాదాపు 35 వేల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు.

పరిశ్రమల్ని మరింత విస్తరణ చేసి యువతకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తమ లక్ష్యం అన్నారు. పార్కు ప్రమోటర్‌ డాక్టర్‌ ఏబీఎస్‌ శాస్త్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు ఉచితంగా ఆధునిక సాంకేతికతను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా ఎంఎస్‌ఎంఈ మేనేజర్‌ సురేష్‌, తహసీల్దార్‌ అనురాధ, సొసైటీ చైర్మన్‌ మద్దినేని సుబ్బారావు, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కుర్రా రత్తయ్య, ఎం వీరారెడ్డి, కందిమళ్ల రఘురామారావు, ముద్దన నాగేశ్వరరావు, తోకల రాజేష్‌, రాఘవయ్య, శిలార్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement