క్షయ విభాగంలో జాగ్రత్తే లేదయా.. | - | Sakshi
Sakshi News home page

క్షయ విభాగంలో జాగ్రత్తే లేదయా..

May 25 2026 3:16 AM | Updated on May 25 2026 3:16 AM

క్షయ విభాగంలో జాగ్రత్తే లేదయా..

అధ్వానంగా పరిస్థితులు

వైద్యశాలలో ప్రశ్నార్థకంగా

ఆరోగ్య భద్రత

గర్భిణులు, టీబీ పేషెంట్‌లకు

పక్కపక్కనే వైద్యసేవలు

రోగ నిరోధక శక్తి తక్కువగా

ఉండటంతో గర్భిణుల్లో ఆందోళన

ప్రాణాలతో చెలగాటం

ఆడుతున్నారని రోగుల మండిపాటు

వైద్యాధికారుల నిర్లక్ష్యంపై

తీవ్ర విమర్శలు

నరసరావుపేట టౌన్‌: ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి నేడు అంటువ్యాధుల కేంద్రంగా మారింది. వైద్యాధికారుల నిర్లక్ష్యం తల్లీబిడ్డల ప్రాణాలమీదకు తెస్తోంది. టీబీ రోగులకు, గర్భిణులకు పక్కపక్కనే వైద్యసేవలు అందించటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల్లో టీబీ వంటి అంటువ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఒకవైపు వైద్యసేవలు అందిస్తూనే పక్కనే గర్భిణులకు పరీక్షలు నిర్వహించటం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా గర్భిణులు, బాలింతల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యంత సున్నితమైన సమయంలో టీబీ రోగుల పక్కగదిలోనే పరీక్షించటం దారుణమని గర్భిణులు వాపోతున్నారు.

అడుగు పెట్టినప్పటి నుంచి కష్టాలే..

పల్నాడు జిల్లాకు పెద్దాసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలకు నిత్యం పల్నాడు జిల్లాతో పాటు మార్కాపురం, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది వైద్యసేవల కోసం వస్తుంటారు. గర్భిణులుప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు ఓపీ సేవల నిమిత్తం వస్తుంటారు. ఇన్‌పేషెంట్లుగా మరో వంద మంది వరకు సేవలు పొందుతున్నారు. ఏరియా వైద్యశాలలో గర్భిణులకు కొన్నేళ్లుగా మెరుగైన సేవలు అందక అష్ట కష్టాలు పడుతున్నారు. వైద్యశాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి దశలో వారిని సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి. గర్భిణులకు ప్రత్యేక క్యూలైను ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. రోగులకు సరిపడా సిబ్బంది లేకపోవటంతో సేవల కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

గైనిక్‌ విభాగం ఆనుకొని టీబీ రోగుల విభాగం కొనసాగుతోంది. అక్కడే రోగులకు చికిత్స అందించడం, కళ్లె పరీక్షలు నిర్వహిస్తుంటారు. పసిపిల్లలను చేతుల్లో పెట్టుకొని గైనిక్‌ విభాగానికి వచ్చే తల్లులు అక్కడి పరిస్థితులను చూసి భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుందని కలవరపడుతున్నారు. ప్రస్తుతం వైద్యశాల్లో ఉన్న పరిస్థితులు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. గైనిక్‌ విభాగానికి ఆనుకొని ఉన్న టీబీ యూనిట్‌ను వెంటనే మరో భవనానికి లేదా ప్రాంతానికి తరలించాలని గర్భిణులు డిమాండ్‌ చేస్తున్నారు. కనీస ఆరోగ్య భద్రత ప్రమాణాలు పాటించకుండా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

అమ్మ కాబోతున్న వారి కన్నుల్లో చిన్నారి నవ్వుల కలలు మెదులుతుంటే.. పక్కనే టీబీ రోగులకు చికిత్స చేస్తున్నారనే భయమే ఎక్కువగా ఉంటోంది. పరీక్షలంటూ చీటీ చేతిలో పట్టుకుని లైనులో టీబీ రోగుల పక్కనే నిలబడితే ఆరోగ్యానికి రక్షణ ఎక్కడని గర్భిణుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలే ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన గైనిక్‌ సేవలు తల్లీబిడ్డల ఆరోగ్యంపై వందల ప్రశ్నలు సంధిస్తున్నాయి. వార్డులు వేరు చేయడం అంత కష్టమా అంటూ గర్భిణుల జాలిచూపులు వైద్య యంత్రాంగాన్ని నిలదీస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement