వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి సూపర్ సిక్స్ అమలుపై ఇంటింటి సర్వేకు టీడీపీ నాయకులు సిద్ధమా?
వినుకొండ: చంద్రబాబు ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాల పేరుతో కేవలం 20 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూర్చి, మిగిలిన 80 శాతం మందికి అన్యాం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మహిళా నేతలతో కలిసి ఆమె మాట్లాడారు. గతంలో తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో కులమతాలకతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన తీరును, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ తీరును సరిపో ల్చడానికి తాము ఇంటింటికీ వెళ్తామని చెప్పారు. ఏ ప్రభుత్వంలో పథకాలు బాగా అమలయ్యాయో ప్రజలే తేలుస్తారన్నారు.
గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు పరోక్షంగా మూడు రాజధానుల పాలననే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ఐటీ రంగం తరలిపోయిందని, అమరావతి నిర్మాణం పేరుతో మట్టి అమ్ముకోవడం తప్ప అక్కడ జరిగిందేమీ లేదన్నారు. నలుగురు పిల్లల్ని కనండి.. రాష్ట్ర సంపాదన పెంచండి అని పిలుపునిస్తున్న చంద్రబాబు, పిల్లలు లేని పేద కుటుంబాల కోసం ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్లు నెలకొల్పి ఉచిత వైద్య సదుపాయం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. రొంపిచర్ల మాజీ ఎంపీపీ టి.మంగమ్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందరికీ సమానంగా పథకాలు అందించేలా కృషిచేయాలని సూచించారు. సత్తెనపల్లి మండల కన్వీనర్ స్వాతి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ పేరుతో బాండ్లు ఇచ్చి ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారనిఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మహిళా హోం మంత్రి ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కరువైందని, హోం మంత్రి సొంత నియోజకవర్గంలోనే 13 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
వినుకొండలో
తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి
రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం మహిళా అధ్యక్షురాలు జొన్నలగడ్డ హెల్డా ఫ్లారెన్స్ మాట్లాడుతూ.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో తాగునీటి సమస్య పరిష్కారం, ఘాట్ రోడ్డు నిర్మాణం, 100 పడకల ఆసుపత్రి, మున్సిపల్ కాంప్లెక్స్ స్థల కేటాయింపు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యే అయ్యాక కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు బాగా అమలవుతున్నాయని ప్రగల్భాలు పలుకుతున్న జీవీ ఆంజనేయులు, తాము అడిగిన ప్రశ్నలకు క్షేత్రస్థాయికి వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సమావేశంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రజనీరెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఖిల్లా రత్నకుమారి, సంతగుడిపాడు మహిళా అధ్యక్షురాలు ఎన్.మీనా, వినుకొండ టౌన్ కన్వీనర్ సీహెచ్.దుర్గ, బొల్లాపల్లి మండల కన్వీనర్ తిప్పిశెట్టి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.


