నాదెండ్ల: వ్యవసాయంలో నష్టాల కారణంగా అప్పుల బాధ, మరోపక్క భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందన్న మనస్థాపంతో కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. తూబాడు గ్రామానికి చెందిన దన్నవరపు వెంకటేశ్వర్లు (35) గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సాగులో నష్టాల కారణంగా అప్పుల భారం పెరిగి ఆర్థికంగా సతమతమయ్యేవాడు. ఈ నేపధ్యంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈక్రమంలో భార్య, ఇరువురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు శనివారం రాత్రి 11 గంటల సమయంలో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మృతి చెందాడు. చికిత్స సమయంలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భార్య పుట్టింటికి అలిగి వెళ్లినందుకు మనస్తాపానికి గురైనట్లు తెలిపాడు.
పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీలు
నరసరావుపేట: పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణ్రోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి.. మాచర్ల మండలంలో 41.6 డిగ్రీలు, వెల్దుర్తి 42.5, దుర్గి 42.6, రెంటచింతల 44.0, గురజాల 44.1, దాచేపల్లి 44.8, కారెంపూడి 44.0, పిడుగురాళ్ల 48.1, మాచవరం 44.3, బెల్లంకొండ 43.5, అచ్చంపేట 45.4, క్రోసూరు 45.8, అమరావతి 45.0, పెదకూరపాడు 43.3, సత్తెనపల్లి 42.5, రాజుపాలెం 43.9, నకరికల్లు 41.9, బొల్లాపల్లి 42.9, వినుకొండ 42.9, వినుకొండ 42.9, నూజెండ్ల 42.6, శావల్యాపురం 43.6, ఈపూరు, రొంపిచర్ల 44.1, నరసరావుపేట, ముప్పాళ్ల, చిలకలూరిపేట 44.3, యడ్లపాడు 43.9, నాదెండ్ల 44.2 డిగ్రీలు నమోదయ్యాయి.
ముప్పాళ్ళ: పాత కక్ష్యల నేపధ్యంలో వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొని చంపేందుకు యత్నించిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ ఆదివారం తెలిపారు. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా బొల్లవరం అడ్డరోడ్డు వద్ద అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి మట్టి లోడుతో ట్రాక్టర్‌తో వస్తూ వెనుకగా ఢీ కొట్టాడు. శివారెడ్డి ద్విచక్రవాహనంతో పక్కనే పంట కాలువలో పడటంతో కాలుకు తీవ్రగాయమైంది. గాయపడిన శివారెడ్డిని చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై శివారెడ్డి ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు ఆదివారం పర్యాటకులు లాంచీలలో తరలి వెళ్లటంతో లాంచీస్టేషన్‌కు రూ.45వేల ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని 9 అడుగుల బుద్దుని పాలరాతి విగ్రహం, బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.


