జాతీయ రహదారి పనులు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారి పనులు పరిశీలన

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

జాతీయ రహదారి పనులు పరిశీలన వట్టిచెరుకూరులో జాయింట్‌ కలెక్టర్‌ పర్యటన ప్రభుత్వంపై దశలవారీ పోరాటం

వినుకొండ: నూజెండ్లలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ శనివారం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ బ్రౌన్‌ ఫీల్డ్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ స్ట్రక్చర్‌లకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పెగ్‌ మార్కింగ్‌ ప్రక్రియపై ప్రత్యేకంగా రివ్యూ చేసినట్లు పేర్కొన్నారు. పెగ్‌ మార్కింగ్‌ పూర్తయిన తరువాత రెవెన్యూ, సర్వే విభాగాలు ల్యాండ్‌ సబ్‌ డివిజన్‌ రికార్డులను స్క్రూటినీ కోసం పంపిస్తాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను 15 నుంచి 20 రోజులలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ ఎలా జరుగుతుందనే అంశంపై కూడా స్వయంగా ఫీల్డ్‌ విజిట్‌ చేసి పరిశీలించినట్లు ఆమె వెల్లడించారు. ఆమెతోపాటు వినుకొండ తహసీల్దార్‌ సురేష్‌నాయక్‌, అధికారులున్నారు.

గుంటూరు రూరల్‌: వట్టిచెరుకూరు మండలంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ శనివారం పర్యటించారు. సర్వే నం.241లో చెరువుతోపాటు అక్కడ ఉన్న నివాస స్థలాలు కూడా చెరువు పోరంబోకుగా నమోదై ఉండటంతో దానిని గ్రామ కంఠంగా మార్పులు చేయాలని కోరుతూ ప్రజలు గతంలో కోరారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులను త్వరితగతిన వారి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. వట్టిచెరుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్‌.సి.)ను జేసీ తనిఖీ చేశారు. వైద్యం నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరును గమనించారు. శుభ్రత, మంచినీరు, మరుగుదొడ్లు వసతుల గురించి తెలుసుకున్నారు.. అత్యవసర మందులు అందుబాటు ఏ మేరకు ఉన్నాయో తనిఖీ చేశారు. మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.శ్రీనివాసరావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ వెంకటరత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాప్టో పిలుపు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా మలిదశ పోరాటానికి సిద్ధమైనట్లు గుంటూరు జిల్లా ఫ్యాప్టో నాయకులు తెలిపారు. శనివారం నగరంపాలెంలోని ఏపీటీఎఫ్‌–1938 జిల్లా కార్యాలయంలో సమావేశమైన ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు ఈ మేరకు కార్యాచరణ ప్రకటించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ కె.నరసింహారావు, సెక్రటరీ జనరల్‌ కె.వీరాంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మొదటి విడతలో ఈ నెల 6వ తేదీన టెన్త్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. రెండో దశలో ఈనెల 9న స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల వద్ద ధర్నా, మూడో దశలో ఈనెల 25,26,27వ తేదీల్లో విజయవాడలో నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. నిరసన కార్యక్రమాలలో ఉపాధ్యాయులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఈవో కార్యాలయానికి వెళ్లిన ఫ్యాప్టో ప్రతినిధులు డీఈవో షేక్‌ సలీమ్‌ బాషాకు ఆయా కార్యక్రమాలపై నోటీసు అందజేశారు. సమావేశంలో ఫ్యాప్టో కో చైర్మన్‌ షేక్‌ ఫైజుల్లా, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ యు.రాజశేఖర్‌రావు, వై.శ్యాంబాబు, మొహమ్మద్‌ ఖాలీద్‌, జిల్లా నాయకులు మేకల సుబ్బారావు, షేక్‌ జిలానీ బాషా, జి.దాస్‌, బి. ప్రసాద్‌, జె.విజయానంద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement