వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం హాజరైన డాక్టర్ గోపిరెడ్డి, విడదల రజిని, బొల్లా, నంబూరు, డాక్టర్ గజ్జల తదితరులు
నరసరావుపేట: ఓటరు జాబితా సవరణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం మండల కమిటీ మెంబర్లు, బూత్‌లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఎ)లతో జిల్లా బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పిన్నెల్లి మాట్లాడుతూ ప్రతిపక్షాల ఓటర్లను తొలగించేందుకు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంతకై నా తెగిస్తుందన్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలని, ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలని బీఎల్‌ఎలకు సూచించారు. జిల్లా స్థాయి సమావేశం లాగానే నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటుచేసుకొని అందరినీ అప్రమత్తం చేయాలన్నారు. నూతన ఓటర్లను చేర్పించటంపై దృష్టి సారించాలని, త్వరగా అన్నీ కమిటీలను పూర్తిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఓటరు సవరణ ప్రక్రియ (సర్) వచ్చే మే లేదా జూన్‌లో ప్రారంభమౌతుందన్నారు. 2002లో ఉన్న ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని మిగతా ఓటర్లను మాపింగ్ చేస్తారన్నారు. బీఎల్‌ఓలతో అందరూ టచ్‌లో ఉండాలన్నారు. వారు సక్రమంగా పనిచేయకపోతే పార్టీ అధికారంలోకి రావటం కష్టం అన్నారు. చనిపోయిన వ్యక్తుల ఓట్లను తొలగించే ప్రక్రియలో అధికార పార్టీ వారివి కూడా తొలగిస్తున్నారో లేదో గమనించాలన్నారు. డబుల్ ఎంట్రీలు, ఎన్‌ఆర్‌ఐ ఓట్లపై అవగాహన కలిగి ఉండాలని, మైగ్రేట్ అయిన ఓటర్లను కాపాడుకోవాలన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ బూత్ కమిటీ పార్టీకి గుండెకాయ లాంటిదని అన్నారు. వారి కష్టంతోనే పార్టీ పరిస్థితి ముడిపడి ఉందన్నారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మండల కన్వీనర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ బీఎల్‌ఎలను నడిపించాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల్లో నిత్యం ఉండాలని సూచించారు. పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తుల ఓట్లను గమనిస్తూ ఉండాలన్నారు. బీఎల్‌ఓలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ మన ఓటర్లను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని అన్నారు. బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకరరెడ్డి ప్రజంటేషన్ ద్వారా పరిస్థితి వివరించారు. నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డి, పడాల శివారెడ్డి, రేపాల శ్రీనివాసరావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, బాసు లింగారెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షురాలు రోళ్ల మాధవి, బూత్ కమిటీ పల్నాడు, గుంటూరు జిల్లాల అధ్యక్షులు సుబ్బారెడ్డి, పిచ్చిరెడ్డి, ఎస్‌సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


