యడ్లపాడు: యడ్లపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళా నిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల రెండోరోజు పోటీలు ఘనంగా జరిగాయి. శనివారం జరిగిన పోటీల్లో ప్రదర్శించిన పలు నాటికలు ఆహుతులను అలరించడమే కాకుండా ఆలోచింపజేశాయి.
అస్థిత్వ పోరులో కన్నీటి సంతకం!
ప్రకృతి వైవిధ్యంలోని అరుదైన వర్ణాలను అంటరానితనంతో వెలివేస్తున్న ఆధునిక సమాజపు సంకుచిత తత్వాన్ని ఎండగట్టిన కళారూపమే అమ్మచెక్కిన బొమ్మ నాటిక. సీ్త్ర, పురుష ధ్రువాల మధ్య నలిగిపోతున్న తృతీయ ప్రకృతి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవం కోసం వారు చేస్తున్న అలుపెరగని పోరాటాన్ని ఈ నాటిక చూసిన ప్రతి గుండెను తట్టి ప్రశ్నిస్తుంది. గోవాడ క్రియేషన్స్ సమర్పించిన ఈ నాటిక జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథ కాగా, డాక్టర్ వెంకట్ గోవాడ నాటకీకరణ, దర్శకత్వం వహించారు.
బాధ్యతలో ఒదిగిన బంధం.. శ్రీమాత్రే నమః
అమెరికా కలలు, కెరీర్ ఎదుగుదల కోరుకున్న ఓ ఆధునిక యువతి జీవితంలో జరిగిన ఓ ప్రమాదంతో ఊహించని విధంగా మళ్లీన ఆమె జీవన ప్రయాణమే సీ్త్ర మాత్రే నమః నాటిక. ఆశయాలకు, అనుబంధాలకు మధ్య నలిగిపోతున్న ఆమెకు ఒక పెద్దాయన తోడ్పాటుతో ధైర్యం చిక్కి, కన్నతల్లి కాకపోయినా తన సుఖాలను వదులుకుని త్యాగమూర్తిగా నిలిచే గొప్ప సందేశం ఇందులో కనిపిస్తుంది. స్వర్ణసూర్య డ్రామా రివర్స్ (హైదరాబాద్) వారి ప్రదర్శించిన ఈ నాటిక మూలకథ పూర్ణిమా పెమ్మరాజు రాయగా, ఉదయ భాగవతుల అందించిన అద్భుత నాటకీకరణ, దర్శకత్వం ఈ ప్రదర్శనకు ప్రాణం పోసి ఆలోచింపజేశాయి.
శారీరక సౌందర్యపు పొరలు విడిచి..
మాతృత్వం!
బాహ్య సౌందర్యం కోల్పోతాననే భయంతో మాతృత్వాన్ని నిరాకరించిన ఒక యువతి, విధి ఆడిన వింత నాటకంలో తన అహం వీడి అమ్మగా మారిన అద్భుత పరిణామమే ఈ నాటిక కథాంశం. శ్రీరమణా కళానిలయం (గుంటూరు) సమర్పణలో సుఖమంచి కోటేశ్వరరావు రాసిన ఈ నాటకానికి, పొగర్తి నాగేశ్వరరావు తన సునిశిత దర్శకత్వంతో దృశ్యరూపం ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
నీడలా వెంటాడే కొంత స్వార్థం!
అన్యోన్యంగా ఉండే ఒక రైతు కుటుంబంలో ప్రాణప్రియమైన మరదలి వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయవద్దని వదిన అడ్డుపడటంతో తలెత్తిన మమకారాల సంఘర్షణే ఈ నాటిక ఇతివృత్తం. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుత నటనతో సామాన్యుల గుండెలను పిండేలా ఈ నాటికను అందరి మనసుల్ని తాకింది.
నేటి కార్యక్రమాలు..
సుందరయ్య కళానిలయం ఆధ్వర్యాన 5వ తేదీ ఆదివారం నిర్వహించే కార్యక్రమాలు...
రాత్రి 7.15 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి (విజయవాడ) వారి ‘మమ్మల్ని బ్రతక నివ్వండి’ నాటిక, 8.15 గంటలకు ఉషోదయ కళానికేతన్(కట్రపాడు) వారి ‘మంచి మనసులు’ నాటిక, 9.30 గంటలకు తెలుగు కళాసమితి(విశాఖపట్నం) వారి ‘చిటికిన వేలు’ నాటికల అనంతరం బహుమతి ప్రదానం ఉంటుంది.


