ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనునాయక్
చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వానికి పేదల ఆరోగ్యంపై ఎలాంటి ప్రేమ లేదని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ విమర్శించారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.మూడు వేల కోట్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి తెలియజేసినా ఏ మాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది పేదలకు వైద్యాన్ని దూరం చేయడం కాదా అని ప్రశ్నించారు. సుమారు 2.300 ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయడంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్యంపై భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ విధంగా చేయడం పాలకుల ఆలోచనలకు పరాకాష్టగా ఉందన్నారు. వెంటనే ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించి పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడటం మానుకోవాలని, లేని పక్షంలో గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
దుకాణాలను పరిశీలించిన అధికారులు
వినియోగదారుని ఫిర్యాదుతో స్పందించిన ఆహార భద్రతాధికారులు
పర్చూరు(చినగంజాం): ఓ దుకాణంలో కొనుగోలు చేసిన నెయ్యి ప్యాకెట్‌లో సరైన నాణ్యత లేకపోవడంతో ఓ వినియోగదారుడు జిల్లా ఆహార భద్రతా అధికారులను ఆశ్రయించాడు. వినియోగదారుని ఫిర్యాదుకు సత్వరం స్పందించిన అధికారులు గురువారం పర్చూరులో దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు బొమ్మల సెంటర్‌లో నిర్వహిస్తున్న ఓ దుకాణంలో పర్చూరుకు చెందిన పేర్ని హరిబాబు ఓ కంపెనీకి చెందిన నెయ్యి ప్యాకెట్ కొనుగోలు చేశాడు. నెయ్యి ప్యాకెట్‌ను ఇంటికి తీసుకొని వెళ్లి వినియోగిస్తున్న క్రమంలో దానిలో నెయ్యి లక్షణాలు లేకపోగా వాసన కూడా లేకపోవడాన్ని గమనించాడు. దాంతో అనుమానం వచ్చిన హరిబాబు బాపట్ల జిల్లా ఆహార భద్రతాధికారి ప్రణీత్‌కుమార్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న అధికారి సత్వరం స్పందించి ఫిర్యాదు చేసిన దుకాణంపై గురువారం తనిఖీలు నిర్వహించి ఫిర్యాదు చేసిన బ్యాచ్‌కు చెందిన నెయ్యి ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకొని పరిశీలించి నమూనాలను సేకరించాడు. ఆ నమూనాలను ప్రయోగశాల పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నట్లు అధికారి తెలిపారు.
ఎక్కువ మందికి పని కల్పించేందుకు చర్యలు
ఇంకొల్లు(చినగంజాం): వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో ఎక్కువ మందికి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివన్నారాయణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలో 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు చేసిన పనులకు సంబంధించి గురువారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మొత్తం 517 పనులకు సామాజిక తనిఖీ బృందం ప్రజావేదిక ద్వారా బహిరంగంగా విచారించి సమీక్ష నిర్వహించారు. కూలీలకు రూ.8.98 కోట్లు, మెటీరియల్‌కు రూ 3.24 కోట్లు, మొత్తం రూ.12.22 కోట్లు ఖర్చు చేశారని సామాజిక తనిఖీ రిసోర్స్‌పర్సన్‌లు వివరించారు. ఆడిట్ నిర్వహించిన అనంతరం రూ.2.95 లక్షల నగదును రికవరీ చేయాల్సిందిగా గుర్తించారు. అనంతరం ఏపీడీ మాట్లాడుతూ ఆడిట్‌లోగుర్తించిన అంశాలను తెలుసుకొని మళ్లీ తిరిగి జరగకుండా రికార్డు ప్రకారం పనిచేయించాలని సిబ్బందికి ఆయన సూచించారు. గ్రామాల్లో కూలీలకు ఎక్కువగా పనులు కల్పించాలని, కూలీల మస్టర్‌కు సంబంధించి యాప్‌ను ఉపయోగించాలని, యాప్ పనిచేయకపోతే వెంటనే తెలియజేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హ్యూమన్ రిసోర్స్‌పర్సన్ చంద్రశేఖర్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి సతీష్, స్టేట్ రిసోర్స్‌పర్సన్ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో కే సత్యనారాయణ, ఏపీఓలు బుల్లిబాబు, రేణుక తదితరులు పాల్గొన్నారు.


