రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్‌

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

లక్ష్మీపురం: రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి విలువైన లాప్‌ ట్యాప్లు, సెల్‌ఫోన్‌లను చోరీ చేసే ముఠాను గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేసి వారి నుంచి 20 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ సీఐ అంజిబాబు వివరాలు వెల్లడించారు. మార్చి 29న గుంటముక్కల సత్యనారాయణ అనే వ్యక్తి పిఠాపురం నుంచి గుంటూరుకు రాయగఢ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా.. అతని ల్యాప్‌ ట్యాప్‌, సెల్‌ఫోన్‌, ఐటీసీ సంస్థకు చెందిన డ్యాంగిల్‌లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుడు సత్యానారాయణ గత నెల 30వ తేదీన గుంటూరు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి రైల్వే ఆర్పీఎఫ్‌ ఏఎస్‌సీ శైలేష్‌కుమార్‌, గుంటూరు జీఆర్పీ డీఎస్పీ పి.అక్కేశ్వరరావుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు ప్రారంభించారు. సీసీ కెమెరాల సహాయంతో నూతన టెక్నాలజీతో రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి విలువైన సెల్‌ఫోన్‌లు, లాప్‌ట్యాప్‌లు చోరీ చేసే వారిని గుర్తించారు. చోరీ చేసిన వారిలో తెనాలికి చెంది మవల్కర్‌ రమేష్‌, కొవ్వూరు మండలంకు చెందిన కీర్తి రూపీకుమార్‌, చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కుంభ వెంకట్‌లుగా గుర్తించి వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారం పై జీఆర్పీ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వారు పట్టుబడ్డారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ ట్యాప్‌, డ్యాంగిల్‌లు లభ్యం అయ్యాయి. నలుగురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ షేక్‌ మహబూబ్‌ సుభాని, ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరెడ్డి, రైల్వే పోలీసులు వలి, అశ్విన్‌, వాసులను రైల్వే ఆర్పీఎఫ్‌ ఏఎస్‌సీ, డీఎస్పీలు అభినందించారు.

నలుగురిని అరెస్ట్‌ చేసిన జీఆర్పీ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement