సుబ్బరాయశర్మకు సుందరయ్య కళా పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సుబ్బరాయశర్మకు సుందరయ్య కళా పురస్కారం

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

నేడు యడ్లపాడులో ప్రదానం

యడ్లపాడు: నటనలో ఆయనొక ప్రయోగశాల. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కళా ప్రస్థానంలో రంగస్థలాన్ని ఊపిరిగా, వెండితెరకు అలంకారంగా నిలిచిన అరుదైన నటుడు ఉప్పులూరి సుబ్బరాయశర్మ. యడ్లపాడులో జరుగుతున్న 23వ జాతీయ నాటక పోటీల వేదికపై శుక్రవారం ప్రతిష్టాత్మక పుచ్చలపల్లి సుందరయ్య–2026 పురస్కారం అందుకోనున్నారు. 1947లో విజయవాడ సత్యనారాయణపురంలో జన్మించిన సుబ్బరాయశర్మ కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే ముఖానికి రంగు పూసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు అలుపెరగని కళాకారుడిగా కొనసాగుతున్నారు. రేడియోలో ‘ఏ గ్రేడ్‌’ ఆర్టిస్టుగా వందలాది నాటికలకు ప్రాణం పోశారు. దూరదర్శన్‌ ప్రారంభ దినాల్లో సీని నటుడు కోట శ్రీనివాసరావుతో కలిసి బుల్లితెరకు పరిచయం అయ్యారు.

● ఉప్పులూరి నటన ఎంతటి శక్తివంతమైనదో చెప్పడానికి ఒక ఉదాహరణ.. 30 ఏళ్ల వయసులో ఆయన ‘ఆర్తి’ నాటకంలో 80 ఏళ్ల వృద్ధుడిగా పరకాయ ప్రవేశం చేశారు. ఆ ప్రదర్శన చూసిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు మృణాల్‌ సేన్‌ అప్పట్లో మంత్రముగ్ధులయ్యారు. ప్రయోగాలకర్తగా ప్రసిద్ధి చెందిన దేశోరాజు హనుమంతరావు దర్శకత్వంలో ఆయన చేసిన 45 నిమిషాల ఏకపాత్రాభినయం నాటక చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా నిలిచిపోయింది.

వెండితెరపై విశిష్ట ముద్ర

మాతృదేవోభవ చిత్రంలో భావోద్వేగమైనా, యమలీలలో హాస్యమైనా, బాహుబలి, మగధీర వంటి భారీ చిత్రాల్లో హుందాతనమైనా.. ఆయనకే చెల్లింది. అగ్ర దర్శకులందరితో పనిచేసినా, రూ.కోట్లు కురిపించే సినిమాల్లో నటించినా.. తన మూలాలున్న రంగస్థలాన్ని ఆయన ఎన్నడూ వదలలేదు. తెలుగు నాటక పరిషత్తులకు ఊపిరి పోయడంలో ఆయన కృషి అనితరసాధ్యం. శుక్రవారం రాత్రి 8 గంటలకు యడ్లపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కళా ప్రాంగణంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. నటన, రచన, దర్శకత్వం, నిర్మాణం.. ఇలా చతుర్భుజ ప్రక్రియల్లో కళామతల్లికి ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement