స్టాంపుల అమ్మకాల్లో దోపిడీ
జిల్లా రిజస్ట్రార్ కార్యాలయ కేంద్రంగా అక్రమాలు అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు డాక్యుమెంట్ రైటర్‌లతో కుమ్మక్కు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఫిర్యాదులపై చోద్యం చూస్తున్న అధికారులు
కుమ్మకై ్క దోపిడీ..
నరసరావుపేట టౌన్: నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌ల విక్రయాల పేరుతో జరుగుతున్న అవినీతి తారస్థాయికి చేరింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు కార్యాలయంలో స్టాంప్‌లను విక్రయిస్తూ సిబ్బంది బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారు. దీంతోపాటు డాక్యుమెంట్ రైటర్‌లతో సిబ్బంది కుమ్మకై ్క వ్యవహరించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతుంది. స్టాంపుల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతుండటం ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది. మొదటి నుంచి రిజిస్ట్రార్ కార్యాలయంలో విక్రయించే నాన్ జ్యూడిషియల్, ఫ్రాంక్లీన్ స్టాంపులు, స్పెషల్ అడిసివ్ స్టాంపుల విక్రయాల్లో అవినీతి జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు స్పందించకపోవటంతో సిబ్బంది చేతివాటం రోజురోజుకు పెచ్చుమీరింది. ఒప్పంద పత్రాలు, నోటరీ, అగ్రిమెంట్‌లు, అఫిడవిట్లు, రిజిస్ట్రేషన్, బ్యాంక్ బాండ్స్ తదితర వాటికి స్టాంపుల వినియోగం తప్పనిసరి. స్టాంపులకు ఉన్న డిమాండ్‌ను ఆసరా చేసుకొని సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు.
● ముఖ్యంగా కార్యాలయంలో స్టాంపులు విక్రయించే సిబ్బంది అందుబాటులో ఉండక పోవటం అక్కడ సర్వసాధారణంగా మారింది. ఒక వేళ సిబ్బంది ఉన్నా స్టాంపులు అందుబాటులో లేవని కార్యాలయం ఎదుట ఉన్న డాక్యుమెంట్ రైటర్‌ల వద్ద కొనుగోలు చేయాలని పంపిస్తున్నారు. అక్కడ రూ.100 స్టాంపుకు రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. కార్యాలయ పనివేళలు ముగిసిన తర్వాత వెళితే రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అధిక ధరకు స్టాంపులు కొని నష్టపోతున్నారు.
కళ్లెదుట అవినీతి జరుగుతున్నా..
రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ –1, జాయింట్ –2 రిజిస్ట్రార్‌లు ఇద్దరూ విధులు నిర్వహించే ఎదుటే స్టాంపులు విక్రయించే కేంద్రం ఉంది. అక్కడ బహిరంగంగా స్టాంపునకు రూ.20 అదనంగా విక్రయిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించటం లేదు. స్టాంపులు, ఫ్రాంక్లీన్ ముద్రలకు వచ్చిన వినియోగదారులు గంటలకొద్దీ వేచి ఉంటున్నారు. చివరికి సిబ్బంది అందుబాటులో ఉండకపోవటంతో అసహనంగా బయట డాక్యుమెంట్ రైటర్‌ల వద్ద స్టాంపులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. స్టాంపుల విక్రయ సిబ్బంది చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయానికి సైతం గండిపడుతున్నా అధికారులు స్పందించకపోవటం గమనార్హం.
ఫిర్యాదు చేసినా ప్రయోజనం సున్నా..
రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఇటీవల ఫిర్యాదు చేశారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం విచారణ చేపట్టకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ అవినీతి ఇలానే కొనసాగితే ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు ప్రజలపై అదనపు భారం పడుతుంది.
కొందరు దస్తావేజు లేఖర్లతో కార్యాలయ సిబ్బంది అంతర్గత ఒప్పందం చేసుకొని స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. స్టాంపులు విక్రయించే కేంద్రంలో సిబ్బంది ఉద్దేశపూర్వకంగా స్టాంపులు అందుబాటులో లేకుండా చేసి, బయట అధిక ధరలకు కొనుగోలు చేయించేలా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీనిలో భాగంగానే స్టాంపుల కోసం వచ్చిన వారిని కార్యాలయ సిబ్బందే బయట అధిక ధరకు స్టాంపులు కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. విక్రయాల ద్వారా వచ్చిన అధిక సొమ్మును సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్‌లు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


