బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి పాస్టర్ల సంక్షేమానికి కృషి రావణ వాహనంపై ఆదిదంపతులు

సత్తెనపల్లి: పట్టణంలోని రఘురామ్‌నగర్‌లో గల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సత్తెనపల్లి ప్రధాన సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌ )థౌషిద్‌ హుస్సేన్‌ సోమవారం సందర్శించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్‌, సత్తెనపల్లి సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌ ) వి.విజయ్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు వసతి గృహం విద్యార్ధినిలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముందుగా న్యాయమూర్తి థౌషిద్‌ హుస్సేన్‌ వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు. విద్యార్ధినిలకు అందిస్తున్న ఆహారం, అవసరమైన సరకులు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినిలకు అందాల్సిన సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో న్యాయవాదులు దివ్వెల శ్రీనివాసరావు, గంటా వెంకటశివ, బుర్రి సైదయ్య, పారా లీగల్‌ వాలంటీర్‌ షేక్‌ సుభాని, వసతి గృహ అధికారిణి ఎం.ఇందిరాగాంధీ, కోర్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశంలో నాయకులు

తెనాలి రూరల్‌: పాస్టర్ల సంక్షేమానికి పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కృషి చేస్తుందని అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. అసోసియేషన్‌ మార్చి నెల సమావేశాన్ని పట్టణంలోని కల్వరి కృప చర్చిలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్‌ డాక్టర్‌ పినపాటి జాన్‌పాల్‌, గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ కత్తెర సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ పాస్టర్లు నిబద్దతతో సేవ చేయాలని, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. అసోసియేషన్‌ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే పాస్టర్లకు అసోసియేషన్‌ అండగా ఉంటుందన్నారు. అసోసియేషన్‌ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నామని, అవసరతలో ఉన్న దైవ సేవకులకు ఆర్థిక చేయూత సైతం అందజేసే విధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న సూక్తి ప్రకారం అసోసియేషన్‌ లోని ప్రతి సభ్యుడికి సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. పాస్టర్లకు దేవుని సువార్త అందించటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. దేవునిపై నమ్మకం ఉంచి దేవుని సేవ చేసే వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయన్నారు. అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రెవరెండ్‌ మల్లవరపు విజయ్‌ కుమార్‌, జె.ప్రభుదాస్‌, చిలక జాన్‌ వరప్రసాదరావు, అన్నం ఆదాం, విలియం కేరి, గడ్డం జాన్‌బాబు, ఎం.షడ్రక్‌, పొదిల ఏసోబు, శ్రీకాంత్‌, రజనీకాంత్‌, ఎం.షాలేమ్‌రాజు, తూమాటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సోమవారం రావణ వాహన సేవ జరిగింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో రెండో రోజైన సోమవారం ఉదయం మూలమంత్ర హవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రహవనం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలోని మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. రావణ వాహనంపై కొలువై ఉన్న శ్రీగంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన రావణ వాహన సేవ రథం సెంటర్‌, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆదిదంపతులకు భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆదిదంపతులకు పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, చిన్నారుల కోలాట విన్యాసాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య నగరోత్సవం కనులపండువగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement