అమ్మ లేదన్న చేదు నిజాన్ని దాచి.. | - | Sakshi
Sakshi News home page

అమ్మ లేదన్న చేదు నిజాన్ని దాచి..

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

యడ్లపాడు: ఒకవైపు భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పరీక్ష.. మరోవైపు ప్రాణ సమానమైన అమ్మ భౌతికకాయం. కన్నతల్లి మరణ వార్తను గుండెల్లోనే దాచుకున్న ఆ కుటుంబం చిన్నారికి చెప్పలేదు. పరీక్ష ముగిశాక తల్లి ఇక లేరన్న నిజం చిన్నారి దృష్టికి తీసుకెళ్లారు. యడ్లపాడు హైస్కూల్‌ రోడ్డులోని కొత్తూరుకు చెందిన మొగిలి వెంకటేశ్వర్లు, సునీత దంపతులు కొంతకాలంగా నరసరావుపేటలో నివాసం ఉంటున్నారు. అక్కడ వస్త్ర వ్యాపార దుకాణం నడుపుతూ తమ ఇద్దరు కుమారులను ప్రయోజకులను చేయాలని కలలు కన్నారు. అందులో భాగంగానే చిన్న కుమారుడు జగదీష్‌ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం యడ్లపాడు వచ్చి వెళ్తుండగా కోండ్రుపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారి జీవితాల్లో చీకటి నింపింది. తీవ్రంగా గాయపడిన సునీత గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. అమ్మ ఇక లేదన్న చేదు నిజాన్ని వింటే జగదీష్‌ పరీక్ష రాయలేడని భావించిన తండ్రి, బంధువులు ఆ నిజాన్ని దాచారు. గుండె నిండా దుఃఖం ఉన్నా, ముఖంపై చిరునవ్వు నటిస్తూ సోమవారం జగదీష్‌ను నరసరావుపేట సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ పరీక్ష కేంద్రానికి పంపారు. పరీక్ష ముగిసి బయటకు రాగానే.. బంధువులు అసలు విషయం చెప్పారు. అమ్మ ఇక లేదని విన్న ఆ బాలుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. వెంటనే అతడిని యడ్లపాడుకు తీసుకువచ్చారు. పరీక్ష రాసి వచ్చిన చేతులతోనే అమ్మ పాదాలకు నమస్కరించాడు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. అంత్యక్రియల అనంతరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement