గోపీ కుటుంబానికి అంతిమ సంస్కారాలు
నాదెండ్ల: తమ కుమార్తె పుట్టుకతోనే జన్యు లోప సమస్యతో బాధపడుతుండటంతో మనోవేదనకు గురై చిన్నారితో సహా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సాతులూరులో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన డాక్టర్ కుంభా గోపీ భోపాల్ ఎయిమ్స్‌లో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శంకరకుమారితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె మౌనిక ఉంది. కుమార్తె పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతుండటంతో దంపతులు వేదన పడేవారు. ఈ క్రమంలో కుమార్తెతో కలిసి నరసరావుపేటకు చేరుకున్న దంపతులు స్థానికంగా ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఉదయం డాక్టర్ గోపీ తన భార్య శంకరకుమారి, కుమార్తె మౌనికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి తాను కూడా తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. భార్య, కుమార్తె అప్పటికే మృతి చెందగా, గోపీ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. దీంతో మృతదేహాలను స్వగ్రామమైన సాతులూరుకు తరలించారు. గోపీ కుటుంబాన్ని చివరిసారి చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.


