పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

పేదల సొంతింటి కల సాకారం

కలెక్టర్‌ కృత్తికా శుక్లా

పిడుగురాళ్ల: పేదల సొంతింటి కల సాకారం అయిందని జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా అన్నారు. సోమవారం పట్టణంలోని టిడ్కో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇల్లు పొందిన ప్రతి ఒక్కరూ వెంటనే కొత్త ఇంటిలోకి మారిపోవాలని అన్నారు. లబ్ధిదారులు ఈ నూతన గృహాలలో ఉండకపోతే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక్కడే ఉంటే అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కాలనీలో ప్రత్యేకంగా ఒక రేషన్‌ డిపో, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రూ. 83 కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టామని మిగిలిన రూ.14 కోట్లతో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2014 టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర సహకారంతో పిడుగురాళ్లలో ఆరు వేల ఇళ్లకు అనుమతులు తీసుకొచ్చి నిర్మాణాలు చేపట్టామని, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా పట్టణంలో 1273 ఇళ్లను పూర్తి చేసామని మొదటి విడతలో భాగంగా 94 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 15 నాటికి ఓపీ ప్రారంభం

పిడుగురాళ్ల రూరల్‌: మండలంలోని కామేపల్లి గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా సోమవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మెడికల్‌ కళాశాలలోని హాస్పటల్‌ను ఏప్రిల్‌ 15లోగా పూర్తిచేసి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అవసరమైన అన్ని నియామకాలను పూర్తి చేస్తున్నామన్నారు. మే 15 కల్లా మెడికల్‌ కళాశాలను పూర్తి చేసి వంద ఎంబీబీఎస్‌ సీట్లతో విద్యా సంవత్సరం ప్రారంభిస్తామన్నారు. పల్నాడుకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఒక వరం అన్నారు. ఇకపై వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని వైద్య సదుపాయాలు పల్నాడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి సేవలు అందిస్తామన్నారు. సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement