నివేదిక పంపాం
ఏళ్లు గడుస్తున్నా అదే మొత్తం వసూలు 20 ఎకరాలు గ్రీన్‌ఫీల్డ్ హై వేకు భూసేకరణ ఐదేళ్ల క్రితం తీసుకున్నా నేటికీ అందని పరిహారం పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు అమరేశ్వరుడి మాన్యాలకు కౌలు పెంచాలని డిమాండ్లు
దేవుడు మాన్యాలకు కౌలు ఎకరాకు రూ.వెయ్యి మాత్రమే
అమరావతి: అమరేశ్వరుని భూముల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న రైతులు ఎకరాకు రూ.వెయ్యికి మించి కౌలు ఇవ్వడం లేదు. అలాగని కౌలు పెంచటానికి శాఖాపరంగా దేవదాయ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు శూన్యంగానే ఉన్నాయి. గ్రామంలో మిగిలిన పొలాలకు కనీసం రూ. ఆరు వేల నుంచి రూ. తొమ్మిది వేల వరకు కౌలు పలుకుతోంది. అమరేశ్వరుని భూములకు ఎకరాకు రూ. వెయ్యి కౌలు ఇస్తుంటే దేవాలయ అధికారులు ఆదే మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఏడాదికి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల కౌలు ఆదాయం రావాల్సి ఉంది. కానీ సుమారు రూ.నాలుగు లక్షలు మాత్రమే వస్తోంది. అలాగే ఈ భూమిలో సుమారు 20 ఎకరాల భూమి ఖమ్మం–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఐదేళ్ల క్రితం తీసుకున్నా ఇప్పటివరకు పరిహారం రాలేదు. న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు సహకరించకపోతే ఓట్లు పోతాయనే భయంతో రాజకీయ నాయకులు, వారికి భయపడే అధికారులు వల్ల అమరేఽశ్వరుడు ప్రతి ఏడాది నష్టపోతున్నారు.
రైతుల ఐకమత్యం
అందరూ ఏకమై నామమాత్రంగా..
క్రీ.శ. 17వ శతాబ్దంలో అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు స్వామివారి నిత్య ధూప, దీప నైవేద్యాలకు ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలోని 410.34 ఎకరాల మాన్యాన్ని అందించారు. కాలక్రమేణా వాసిరెడ్డి వంశస్తుల అజమాయిషీలో మాన్యం కౌలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వామి వారి సేవలకు వినియోగించారు. 19వ శతాబ్దంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తరువాత భూముల వేలం పాటలపై అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఆ భూములకు రైతులు కొన్నాళ్లు కౌలు చెల్లించకుండా పండించుకున్నారు. కొందరు అధికారులు చేసిన ప్రయత్నాలతో ఎకరాకు రూ.200 నుంచి రూ.400 వరకే కౌలు చెల్లించారు. గ్రామాలలో బహిరంగ వేలం పాటల్లో ఎవరూ పాల్గొనకుండా ఎకరాకు రూ.400 నుంచి రూ. వెయ్యి కౌలు కడుతున్నారు.
పరిహారం ఆలస్యం
అమరేశ్వర దేవస్థానానికి చెందిన సుమారు 20 ఎకరాల భూమి ఖమ్మం–విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూ సేకరణ చేశారు. భూములు దేవుడి పేరున ఉన్నా రైతుల ఆధీనంలో ఉండటంలో పరిహారం విషయంలో వివాదం తలెత్తింది ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ అధికారులు దేవుని భూములకు పరిహారం అమరేశ్వరునికే చెందటానికి న్యాయస్థానంలో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. 2021లో భూసేకరణ చేసిన గ్రామాలలో ప్రైవేటు వ్యక్తులు వెంటనే పరిహారం పొందినప్పటికీ అమరేశ్వరుని రావాల్సిన పరిహారం పొందటానికి తెలంగాణ హైకోర్టులో ఉన్న పరిహారం కేసు అంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. మొత్తం దాదాపు రూ.2.70 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు రావాల్సి ఉంది. మిగిలిన 390 ఎకరాల భూమికి బహిరంగ కౌలు వేలం పాటలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా కుగ్రామాలలో సైతం భూముల విలువ ప్రతి ఏడాది పెరుగుతుంటుంది. ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరునికి చెందిన ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో ఉన్న భూమి మాత్రం దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విలువ పెంపు, కౌలు పెరిగే అవకాశం కనబడటం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు, దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల అమరావతి అమరేశ్వరస్వామి కౌలు ఆదాయానికి ఏటా భారీగా గండి పడుతూనే ఉంది.
ఆలయ ఈవో రేఖ మాట్లాడుతూ ఇటీవల హైకోర్టు సంబంధిత 20 ఎకరాల భూమి అమరేశ్వరునికే చెందాలని నిర్ణయించిందన్నారు. ఇప్పటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపామని తెలిపారు. మిగిలిన భూమికి కౌలు పెంపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.


