రోజు రోజుకూ సమస్య మరింత జఠిలం
గ్యాస్ బండ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు
బుకింగ్ చేసిన 45 రోజులకుగానీ మరో సిలిండర్
బ్లాక్‌లో డొమెస్టిక్ రూ. 2 వేలకుపైనే, కమర్షియల్ రూ. 4 వేలకుపైనే
గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటళ్లు, కర్రీ పాయింట్లు
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో వినియోగదారులు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకంలో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ బండలు అందజేస్తామని తెలిపింది. కానీ ఉచితం మాట దేవుడెరుగు .. నేడు డబ్బులిస్తామన్నా గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గ్యాస్ కష్టాలు అన్ని వర్గాల ప్రజలను వెంటాడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందని అంతటా ముమ్మర ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం కొరత లేదని చెబుతోంది. అధికారులు కూడా గ్యాస్ ఏజెన్సీలను పరిశీలిస్తున్నా సమస్యలు లేవని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే కనిపిస్తాయని వినియోగదారులు చెబుతున్నారు.
మూతపడుతున్న హోటళ్లు...
సత్తెనపల్లి: యుద్ధ కారణంగా గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. రోజువారీ సరఫరాకు అంతరాయం కలగడంతో హోటల్స్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిక ధరలు చెల్లించి బ్లాక్‌లో సిలిండర్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, పునుగు, బజ్జీ వ్యాపారాలు మూసి వేస్తున్నారు. మరికొందరు టిఫిన్స్, మీల్స్ ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో ఇండియన్, హెచ్‌పీ, భారత్, తదితర కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీలు 51 ఉన్నాయి.వీటి పరిధిలో సుమారు 7.35 లక్షల గృహ అవసరాల కనెక్షన్లు ఉన్నాయి. అమెరికా–ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో 14.20 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్‌కు సంబంధించిన 19 కిలోల సిలిండర్లపై రూ. 110 చొప్పున వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపిన విషయం విదితమే.
బ్లాక్ మార్కెట్‌కు తరలింపు
జిల్లాలో మొత్తం 7.35 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఉండగా ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి ఏడు సిలిండర్లు వినియోగిస్తుందని అంచనా. కాగా గ్రామీణ ప్రాంతాల్లో వంట వినియోగానికి కట్టెల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న కుటుంబాల్లో ఒక్కో సిలిండర్ మూడు నుంచి నాలుగు నెలలుపైగానే వస్తుంది. డెలివరీ బాయ్స్, ఏజెన్సీలు ఇలాంటి వారికి కొంత మొత్తం చెల్లించి వీటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ కష్టాలతో విద్యుత్‌తో పని చేసే ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ అయిపోతే వంట కష్టమేనని వినియోగదారులు హోల్‌సేల్, రిటైల్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. కొద్ది రోజులుగా రూ. రెండు వేల నుంచి రూ. మూడు వేల మధ్యలో లభించే ఆయా గృహాపకరణలకు డిమాండ్ పెరిగిందని హోమ్‌గూడ్స్ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో గృహ, వాణిజ్య అవసరాల కోసం వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.


