ఎప్పుడెప్పుడు రెడ్ సిగ్నల్ పడుతుందా అని ఎదురుచూసే పసి హృదయాలు ఆగిన వాహనాల వైపు కదులుతున్నాయి. తలకు తైల సంస్కారం జరిగి ఎంత కాలమైందో మాసిన బట్టల్లో వారి ముఖాలు మరింత బేలగా ఉన్నాయి. పుస్తకాలు అందుకోవాల్సిన చేతులు.. అయ్యా అంటూ బిచ్చమెత్తుకుంటున్నాయి.. అమ్మ గోరుముద్దలతో ఆకలి తీర్చుకోవాల్సిన పసిప్రాణాలు, ఎర్రటి ఎండలో నడివీధిలో ఆకలి పోరాటం చేస్తున్నాయి.
నరసరావుపేట టౌన్: బంగారు భవిష్యత్తును దిద్దుకోవాల్సిన చిన్నారుల చేతులు.. చిల్లర కోసం వెతుకుతుంటే గుండెలు బరువెక్కుతున్నాయి. బాల్యాన్ని బజారుపాలు చేసిన వారిని శిక్షించాల్సిన వారి కళ్లకు నిర్లక్ష్యపు గంతలు కట్టుకున్నాయి. బడిబాట పట్టించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించటంతో గుప్పెడు మెతుకుల కోసం ఆటపాటలకు సమాధి కట్టిన బాల్యం యాచిస్తూ రొడ్డున పడింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణ నడిబొడ్డులో ఉన్న మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బడిఈడు పిల్లలు ప్రతిరోజు యాచిస్తూ కనిపించటం ఆందోళన కలిగిస్తుంది. సిగ్నల్ పడిన సమయంలో నిలిచిన వాహనదారుల వద్దకు వెళ్లి యాచిస్తున్నారు. నిత్యం ఆ మార్గం గుండా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ చిన్నారులచే వారి తల్లిదండ్రులు యాచక వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇది చూసిన ప్రజానీకం విద్యాశాఖ, కార్మిక శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడిఈడు పిల్లలు బహిరంగంగా మండుటెండలో యాచిస్తూ కనబడటం అధికారుల కళ్లకు కనిపించటం లేదా అని నిలదీస్తున్నారు. స్పెషల్ డ్రైవ్‌లు పేరిట దుకాణాల్లో, మెకానిక్ షెడ్‌లలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసే అధికారులు కళ్లెదుట బాలలు యాచిస్తూ ఉన్నా కనిపించక పోవటం శోచనీయం అని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


