ఏప్రిల్ 15 కల్లా వైద్యశాల అందుబాటులోకి.. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఏపీ మెడికల్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌర భ్ గౌర్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆదేశం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 80 శాతంవైద్యశాల పూర్తి, 40 శాతం కళాశాల నిర్మాణం పూర్తి
పిడుగురాళ్ల రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరు చేసి వైద్యశాల, కళాశాలలు అతి త్వరలో పల్నాడు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పల్నాడు ప్రాంతానికి మణిహారంగా ఉండే మెడికల్ కళాశాల అందుబాటులోకి తీసుకొని రావాలని ఎంతో కృషి చేసి ప్రారంభించారు. దీనిలో భాగంగానే అధికారులు బుధవారం మెడికల్ కాలేజీని సందర్శించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలుత ఏపీ మెడికల్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మెడికల్ కాలేజీని సందర్శించారు. మెడికల్ కళాశాల, వైద్యశాలకు సంబంధించిన బ్లాక్‌లకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను పరిశీలించారు. అనంతరం వైద్యశాలలోని ప్రతి బ్లాక్‌ను సందర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి వివరాలు సేకరించారు. ఏప్రిల్ 15వ తేదీకల్లా వైద్యశాల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో సౌరభ్ గౌర్ మాట్లాడుతూ... రోగులకు వైద్యసేవలను ప్రారంభించేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వైద్య సేవల తేదీలను ప్రకటిస్తామని తెలియజేశారు. విద్యా సంవత్సరం 2026–27 నుంచి ఎంబీబీఎస్ 100 సీట్ల మంజూరు కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశామని తెలిపారు. దీనికి అనుగుణంగా ఎన్‌ఎంసీ నియమించే కమిటీ ఇన్‌స్పెక్షన్ కోసం వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మే నెల ఆఖరి నాటికి నిర్మాణాలు కాంట్రాక్టర్లతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కళాశాల నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరగాలని ఆయన అన్నారు. విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. కళాశాల నిర్మాణానికి తగ్గటుగా పారామెడికల్, వైద్య సిబ్బంది నియామకాలను, డీఈఎంఈ, డీహెచ్‌వో అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ... అధికారులు సమన్వయంతో పని చేసి వైద్యశాల ఏప్రిల్ 15వ తేదీకల్లా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీ నుంచి మెడికల్ కాలేజీని మంచినీటి సౌకర్యం ఆలస్యం కాకుండా చూడాలని, అదేవిధంగా విద్యుత్‌శాఖ అధికారలు సరఫరాతోపాటు జనరేటర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు, రోగులు వచ్చేందుకు ఆర్టీసీ అధికారులతో రిక్వస్ట్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా వైద్య సిబ్బంది రిక్రూట్‌మెంట్ వెంటనే పూర్తి చేసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం కామేపల్లి గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని, జానపాడు గ్రామంలోని ఉప ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రఘునందన్, డీహెచ్‌వో పద్మావతి, మెడికల్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, సీఈ నెహ్రూ, గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపల్ సుందరాచార్య, పల్నాడు డీఎంహెచ్‌వో రవి, విద్యుత్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.


