కలెక్టరేట్‌లో ఏసీబీ కలకలం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ఏసీబీ కలకలం

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

కలెక్టరేట్‌లో ఏసీబీ కలకలం

కలెక్టరేట్‌లో ఏసీబీ కలకలం

కలెక్టరేట్‌లో ఏసీబీ కలకలం

నాలుగేళ్లలో తొలిసారి

ఏసీబీకి చిక్కిన డీఆర్‌ఓ

జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం

నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్‌ ఉద్యోగుల్లో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జిల్లాస్థాయి ఉన్నతాధికారి ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఇది కలెక్టరేట్‌కు మాయని మచ్చగా తయారైంది. శుక్రవారం రాత్రి షేక్‌ కరిముల్లా అనే క్యాటరింగ్‌ నిర్వాహకుడి నుంచి రూ.మూడు లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) ఏకా మురళి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన విషయం విదితమే. 2022 ఏప్రిల్‌లో పల్నాడు జిల్లా ప్రకటించటం, పాత ఎన్‌ఎస్‌పీ సూపరింటెండెంట్‌ ఇంజినీరింగ్‌ భవనంలో నూతన కలెక్టరేట్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ముగ్గురు డీఆర్‌ఓలు పనిచేశారు. మూడో డీఆర్‌ఓగా మురళి జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధి సిఫార్సుపై నియమితులైనట్లు ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడే పలువురు చర్చించుకున్నారు. ఇంతకు ముందు మురళి ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఆర్‌డీఓగా పనిచేయటం గమనార్హం. ఇప్పుడా ప్రజాప్రతినిధి మనుషులు డీఆర్‌ఓను ఎవరు పట్టించారంటూ పట్టించిన వ్యక్తి కోసం వెతుకులాడినట్లు సమాచారం.

లంచాల కోసం వేధింపులు

ఏసీబీ విడుదల చేసిన ప్రకటన మేరకు డీఆర్‌ఓ లంచాల కోసం బాగా వేధిస్తాడనే విషయం తేటతెల్లమౌతుంది. ఇప్పుడు రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడటమే కాకుండా అంతకుముందే సదరు క్యాటరింగ్‌ యజమాని నుంచి జనవరి ఏడున డీఆర్‌ఓ రూ.4 లక్షలు బలవంతంగా వసూలు చేసినట్లు సమాచారం. తొలుత రూ.5 లక్షలు ఇస్తేనే చెక్‌ ఇస్తానని బెదిరించటంతో బాధితుడు రూ.4 లక్షలు ఇవ్వగా పరిపాలనాధికారికి కూడా మరో రూ.50 వేలు ఇవ్వాలని అడగటంతో అవి కూడా వసూలు చేశాడు. చెక్కు ఇస్తూ పైఅధికారులకు సైతం డబ్బులు ఇవ్వాలని మరో రూ.5 లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు. తన వద్ద అంత డబ్బులు లేవని, తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని చెప్పటంతో ఆ చెక్కు క్యాష్‌ కాకుండా డీఆర్‌ఓ అడ్డుకున్నాడని తెలుస్తోంది. బాధితుడు బ్రతిమిలాడగా డీఆర్‌ఓ రూ.3 లక్షలు డిమాండ్‌ చేయటంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి వచ్చి డీఆర్‌ఓను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న డీఆర్‌ఓ ఏసీబీకి దొరకటం మిగతా ఉద్యోగుల్లో కలవరానికి గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement