కల్లగా మారిన సొంతింటి కల
చంద్రబాబు ప్రభుత్వంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలు కళాహీనంగా జగనన్న కాలనీలు మౌలిక వసతులు కరువు లబోదిబోమంటున్న లబ్ధిదారులు
మౌలిక వసతులు కల్పించాలి
ఇళ్ల స్థలాలు చూపించాలి
దాచేపల్లి : పేదల ఇళ్లపై కూటమి సర్కార్ పగబట్టటంతో జగనన్న కాలనీలు నేడు కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. సొంతింటి కలకు పేదలు నోచుకోవడం లేదు. జగనన్న కాలనీల ద్వారా కొత్త ఊర్లు రూపాంతరం చెందేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తే..నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
కళకళలాడిన కాలనీలు
దాచేపల్లి జగనన్న కాలనీలో మొదటి దశలో 1020 మంది పేదలకు స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేశారు. వీటిల్లో 728 మంది ఇళ్లు నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. రెండవ దశలో 1,870 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇళ్లు మంజూరు కాలేదు. గోగులపాడు రోడ్డులో 450 మందికి, దుర్గా పబ్లిక్ స్కూలు వెనుక 129 మంది, ఇరికేపల్లిలో 129 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వీరు కూడా ఇళ్లు కట్టుకుని వాటిల్లో నివాసం ఉంటున్నారు.
కాలనీల్లో వసతుల కల్పన
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో తాగునీరు. కరెంట్, రోడ్ల వసతి కల్పించేందుకు నాటి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తీవ్రంగా కృషి చేసి, మౌళిక వసతులు కల్పించారు. ఎక్కువ కుటుంబాలు జగనన్న కాలనీల్లో నివాసం ఉండటంతో అవి గ్రామాలుగా రూపాంతరం చెందాయి.
వెలవెలబోతున్న కాలనీలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్నన కాలనీలు వెలవెలబోతున్నాయి. కొత్తగా ఇళ్లు మంజూరు చేయకపోవడంతో పట్టాలు తీసుకున్న పేదలు ఆశతో ఎదురు చూస్తున్నారు. దాచేపల్లి జగనన్న కాలనీలో 1,840 మందికి పట్టాలను ఇస్తే, ఇప్పటి వరకు స్థలాలను కూటమి ప్రభుత్వం చూపించలేదు. తాగునీరు, రోడ్లు, కరెంట్ సమస్యలు ఉండటంతో ఇల్లు మంజూరు చేసిన కట్టే పరిస్థితిలో లబ్ధిదారులు లేరు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఆరు జగనన్న కాలనీలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. అక్కడ ఉండలేక మళ్లీ దాచేపల్లికి వచ్చి అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ అవస్థలు పడుతున్నారు.
జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని వసతులు కల్పించటంతో నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుని అందులో నివాసం ఉన్నారు. జగనన్న కాలనీలపై కూటమి ప్రభుత్వానికి వివక్ష తగదు. కాలనీల్లో అన్ని వసతులు కల్పించాలి.
–షేక్ డాడీ, దాచేపల్లి
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటిౖకైనా స్పందించి పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించి ఇళ్లు మంజూరు చేయాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేయడం వల్ల అత్యధికంగా నిర్మాణాలు జరిగాయి. పేదల సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం సాకారం చేయాలి.
–షేక్ ఖాదర్ బాషా, వైస్ చైర్మన్, దాచేపల్లి
కల్లగా మారిన సొంతింటి కల
కల్లగా మారిన సొంతింటి కల


