యువత చేతిలోనే దేశ భవిత
ఎస్పీ బి.కృష్ణారావు
నరసరావుపేట ఈస్ట్: యువత చేతిలోనే దేశ భవిత ఉందని, నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం విద్యార్థుల నుంచే రావాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో బుధవారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్యలపై విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూమాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇందులో విద్యార్థి లోకం కీలకపాత్ర పోషించాలని తెలిపారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉంటూ వాటి సమాచారాన్ని పోలీసులకు అందివ్వాలని ఆయన కోరారు. యువత తేలికగా మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. వ్యసనాలకు అలవాటు పడి, మానసిక నియంత్రణ కోల్పొయి నేరాలకు పాల్పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ సమూలంగా నిర్మూలించేందుకు నడుం బిగించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 370 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని, విద్యార్థి లోకం అప్రమత్తంగా ఉంటూ డ్రగ్స్ వినియోగదారులు, అమ్మకందారుల సమాచారాన్ని పోలీసులకు, 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు. బాలికలు, మహిళల భద్రతకు శక్తి యాప్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మైనర్లు మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని, వారికి వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. డీఎస్పీ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ కుటుంబ పెద్ద, తండ్రికి హెల్మెట్‌ను కానుకగా ఇవ్వాలని సూచించారు. కేవలం నిర్లక్ష్యం, అశ్రద్ధతోనే హెల్మెట్‌లు ధరించటం లేదని తెలిపారు. బాలికలు ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, సీఐలు షేక్ ఫిరోజ్, ప్రభాకర్, ఎం.వి.సుబ్బారావు, ట్రాఫిక్ సీఐ లోకనాథం, కళాశాల కార్యదర్శి నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపాల్ ఎం.ఎస్.సుధీర్, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాససాయి, ఎన్‌సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె. రాజు పాల్గొన్నారు.


