తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఓ హోటల్‌లో బుధవారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకునేందుకు రైతులను సంఘటిత పరచాలని ఆ దిశగా ఉద్యమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో వచ్చే ఏడాది జనవరి 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీన జరగనున్న అఖిలభారత కిసాన్ సమితి జాతీయ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఙరైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఙమాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం వల్ల స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ వాటా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో ఒక్క పంటకీ గిట్టుబాటు ధరలు లేవన్నారు. గుంటూరులో జరిగే ఏఐకేఎస్ జాతీయ సమావేశాలకు రైతు సంఘం నాయకులు అశోక్ దావాలే, హనన్ మొల్ల విజూ కృష్ణ హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్ల సూరయ్య చౌదరి, లాం ఫారం మాజీ అసోసియేట్ డైరెక్టర్ ఆర్.అంకయ్య, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మూర్తి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ సమావేశాలకు సంబంధించిన ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య


