ప్రత్యేక దృష్టితో అర్జీలు పరిష్కరించండి
నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు ఇచ్చిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా అధికారులతో కలిసి 112 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఆయా శాఖల పరిధిలో పీజీఆర్‌ఎస్ గ్రీవెనన్స్‌పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొంతమంది దివ్వాంగులు తమకు పింఛన్‌ను పెంపుదల, తదితర సమస్యలతో వచ్చిన వారి వద్దకు స్వయంగా వచ్చి అర్జీలు స్వీకరించారు.
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దుచేయండి
సర్వే నంబరు 818లో 6.5 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు రాళ్ల గుట్ట భూమి ఉండగా 1921 నుంచి 2019 వరకు 58 మందికి అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ రిజిస్ట్రేషన్లు రద్దుచేసి అంతకు ముందు ఆ భూమిని ఎవరికై తే కేటాయించారో వారి హక్కుదారులకు అందజేయాలి.
–దుగ్గి రాంబాబు,
కొత్త గణేశునిపాడు, మాచవరం మండలం
పొలం ఆక్రమించి చేపల చెరువు చేశారు
నాకు 2.46 ఎకరాల డీకే పట్టా భూమి ఉంది. 2019లో ఏ.వెంకటరెడ్డి నా పొలాన్ని ఆక్రమించి దొంగ సర్వే నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేపల చెరువు చేస్తున్నాడు. అదేమని ప్రశ్నించిన నా భర్త, కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టి పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పాడు. ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి నా పొలం నాకు ఇప్పించండి.
–అంబటి
సుధాకర్‌నగర్, నూజెండ్ల మండలం
ప్రత్యేక దృష్టితో అర్జీలు పరిష్కరించండి


