విద్యార్థుల మృతికి కారణమైన ఐదుగురు నిందితుల అరెస్టు
ఈ నెల నాలువ తేదీన పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం డబ్బు వసూలుకు భారీ లారీని నిందితులు ఆపడమే కారణం హఠాత్తుగా ఆగిన ట్రాలీ లారీని ఢీ కొని మృతిచెందిన విద్యార్థులు
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల నాలుగవ తేదీన చిలకలూరిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడగం రామిరెడ్డి, మెరుగు వెంకట నాగ శ్రీకాంత్‌రెడ్డి, గొడవర్తి యశ్వంత్‌సాయి, శివరాత్రి మహేష్‌బాబు, వంగవల్లు వాసు మృతి చెందారు. దీనికి కారణం నరసరావుపేటలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు తన అనుచరులైన పుల్లంశెట్టి మహేష్, బెల్లంకొండ గోపీ, షేక్ నబీబాష, నాలి వెంకటరావులతో కలసి టీఎస్ 08హెచ్‌వై 3158 అనే నంబరుగల కారుతో వాహనాలు ఆపి వాహనదారులను బెదిరించి, కొట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపట్టాడు. ఇందులో భాగంగా చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో మహేంద్ర ట్రాక్టర్ల లోడ్‌తో వెళుతున్న ఎంహెచ్40 డీసీ 0889 నంబర్ గల ట్రాలీ లారీని క్రాస్ చేసి ఆపారు. ఎటువంటి ముందు జాగ్రత్తలు పాటించకుండా హైవే రోడ్డుపై ఒక్కసారిగా భారీ వాహనాన్ని అడ్డుకొని ప్రమాదానికి కారణమయ్యారు. ఒక్కసారిగా భారీ ట్రాలీ లారీ ఆగడంతో వెనుక ఏపీ 40 ఏబీ 0685 కారులో ప్రయాణిస్తున్న విద్యార్థుల కారు లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయి ఇరుక్కుపోయారు. ఇందులో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఇంకా చికిత్స పొందుతున్నాడు.
నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు...
ప్రధాన నిందితుడు మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడుతో పాటు అతని అనుచరులపైన పలు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కోటప్పకొండ వద్ద పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. 10 లక్షలకు రూ.50 లక్షలు ఇప్పిస్తామని మోసానికి పాల్పడిన కేసులోనూ ఇతను నిందితుడు. వీరు పలు కార్ల దొంగతనాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన సమయంలో ఉపయోగించిన కారుకూడా దొంగిలించిన కారుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు చేసిన ఇతర నేరాలకు సంబంధించి విచారణ నిమిత్తం న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి పోలీసుల కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తామని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్‌ఐ జి. పుల్లారావు, రూరల్ ఎస్‌ఐ జి. అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


