ఇంటర్ పరీక్షల మార్పులకు సన్నద్ధం కావాలి
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఇంటర్మీడియెట్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో పల్నాడుజిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, పరీక్ష నిర్వహణ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సైమన్ విక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పాత విధానాన్నే అమలు చేస్తుండగా, ప్రథమ సంవత్సరం పరీక్షల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం సిలబస్లో భారీ మార్పులు జరిగాయనీ, అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపు, అన్సర్ బుక్లెట్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బోటనీ, జువాలజీ పేపర్లు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వీటి ప్రశ్నాపత్రం 43, 42 మార్కులకు కేటాయించగా ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయని, రెండు సంవత్సరాలకు కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మార్పులను విద్యార్థులకు వివరించి వారిని సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షల స్పెషల్ ఆఫీసర్ వి.వి.సుబ్బారావు, రమేష్, ఆర్జేడి జె.పద్మా, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు టి.ప్రభాకర్, కె.వేణు, ఎస్ఎస్ అండ్ ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాససాయి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్షల
నిర్వహణాధికారి సైమన్ విక్టర్
జూనియర్ ఇంటర్ పరీక్ష మార్పులపై అవగాహన సమావేశం


