ధాన్యం కొనుగోడు
ఎకరాకు రూ.20 వేలు అప్పు తప్పటం లేదు
నిబంధనల పేరుతో సక్రమంగా కొనని సర్కార్
సత్తెనపల్లి: జిల్లాలో 1,32,725 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరిగింది. ఇప్పటికే 80 శాతం కోతలు పూర్తయ్యాయి. ఇంకా కోతలు జరగాల్సిన పంట మరో 20 శాతం ఉంటుందన్నది అంచనా. ఖరీఫ్‌లో మొత్తం 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది అధికారులు అంచనా. ఇందులో 40 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 1100 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. మిగిలిన 29,900 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం పూర్తవుతుంది.
తేమ శాతం రైతన్నలకు శాపం...
చంద్రబాబు ప్రభుత్వం తేమశాతం అమల్లో కఠిన నిబంధనలు విధించడం రైతుల పాలిట శాపం గానూ,దళారుల పాలిట వరలా మారింది. చేతికి అంది వచ్చిన ఖరీఫ్ పంట నోటికి అందుతుందనుకున్న ఆశలపై అధిక వర్షాలు, మోంథా తుఫాన్ నీళ్లు జల్లాయి. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి తేమ, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి కష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని అన్నదాతలు భావించారు. అయితే తేమ శాతం పేరుతో ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం, వాతావరణం భయపెడుతుండడంతో గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దళారులు లక్ష మెట్రిక్ టన్నుల పైనే ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. ఇది ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రైతులు అంటున్నారు. అసలే ఆశాజనకంగా లేని దిగుబడులతో రైతులు ఎకరాకు 25 బస్తాలు వస్తున్నాయి. దళారులు రూ.1,300లకు కొనుగోలు చేస్తున్నారు. 25 బస్తాలు విక్రయిస్తే రూ. 32,500 వస్తోంది. ఎకరాకు పెట్టుబడి రూ.49,800 అవుతోంది. ఈ లెక్కన ఒక్క ఎకరం వరి సాగుకు రూ.17,300 రైతు నష్టపోతున్నాడు. అదే కౌలు రైతు అయితే మరో రూ. 10 వేలు అదనంగా నష్ట పోతున్నాడు. జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేసిన 1,32,725 ఎకరాలకు రైతులకు రూ. 22.96 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.
నేను ఎకరం సొంత పొలం, మూడు ఎకరాలు కౌలు సాగు చేస్తున్నా. ఎకరానికి 25 బస్తాలు చొప్పున 100 బస్తాలు దిగుబడులు వస్తే .. ఎకరానికి రూ.20 వేలు నష్టం వచ్చింది. నాలుగు ఎకరాల పైన రూ.80 వేలు నష్టపోయాను. ఎకరానికి 35 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశిస్తే మోంథా తుఫాన్ వల్ల దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ ఏడాది నష్టం తప్ప లాభాలు ఆశించే పరిస్థితి కనిపించడం లేదు.
– రాచమంటి నాగ బ్రహ్మయ్య,
రైతు, మాదల
ధాన్యం కొనుగోడు
ధాన్యం కొనుగోడు


