మాతృ వందనం నమోదుకు కష్టాలు
జిల్లా వ్యాప్తంగా బ్యాంక్‌లో ఎర్రర్ సమస్యలు
ఇబ్బందులు పడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
జిల్లాలో నేటికి 3,634 మంది నమోదు
ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు
సత్తెనపల్లి: జిల్లాలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వర్‌తోపాటు సెల్‌ఫోన్లలో సాంకేతిక కారణాలతో గర్భిణులు, నవజాతి శిశువుల వివరాల నమోదు అరకొరగానే సాగుతోంది. నేటి వర కు 3,634మంది లబ్ధిదారులను మాత్రమే నమోదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
మొదటి కాన్పుకు రూ. 5 వేలు...
ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలు గర్భం దాల్చిన సమయంలో, జన్మనిచ్చిన తరువాత పోషకాహారం, మందుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి కాన్పు అయితే వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 5 వేలు జమ చేస్తారు. అందులో భాగంగానే గర్భిణిగా నమోదు చేసుకున్న సమయంలో రూ. 1,000, బిడ్డ జన్మించినప్పుడు రూ. 2 వేలు, బిడ్డకు టీకాలు వేయించటం పూర్తయిన సమయంలో మరో రూ. 2 వేలు అందిస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ. 6 వేలు జమ చేస్తారు.
అరకొరగానే నమోదు...
ఈ పథకం అమలు కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టులోని కొందరు సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరికొందరు అంగన్‌వాడీ కార్యకర్తలకు కొంత మేర కు తర్ఫీదు ఇచ్చారు. వారి ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ల్లో యాప్‌లు వేసుకొని ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలను నమోదు చేసేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లతో పాటు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్ల ద్వారా వివరాలను నమోదు కోసం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సర్వర్ తోపాటు సెల్‌ఫోన్లలో సాంకేతిక కారణాలు, దీనికి తోడు బ్యాంకుల్లో ఎర్రర్ సమస్యలు, ఆధార్, ఫోన్ నెంబర్ బ్యాంక్ ఖాతాలకు లింక్ కాకపోవడం వంటి కారణాలతో అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో గర్భిణులు మాతృ వందనం పథకం కింద అందే ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.


