ఏపీఐఐసీ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు
రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారుల పరిశీలన
యడ్లపాడు: మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారు. విలువైన ఎర్ర మట్టిని సుదూర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో మండలంలోని బోయపాలెం పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) భూముల్లో అధికార పార్టీకి చెందిన కొందరు యథేచ్ఛగా కొద్ది రోజుల నుంచి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఇదే విషయం ఏపీఐఐసీ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో మంగళవారం ఏపీఐఐసీ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఆకస్మికంగా బోయపాలెం పరిధిలోని ఏపీఐఐసీ భూముల్ని పరిశీలించారు. తవ్వకాలు చేసిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తవ్వకాలకు ఎవరు పాల్పడుతున్నది ఆరా తీశారు. బోయపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో, సెలవు దినాలను అదునుగా తీసుకుని మట్టి తవ్వకాలు సాగిస్తూ ట్రాక్టర్ల ద్వారా తరలించిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాలపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఏపీఐఐసీకి చెందిన భూముల్లో తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది.
ఏపీఐఐసీ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు


