ప్రభుత్వం కూలిపోవడం ఖాయం
ధర్నా చౌక్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఆర్‌ఓకు వినతి
నరసరావుపేట: మహిళలే కదా ఏం చేస్తారులే అని అంగన్‌వాడీలను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయని, అంగన్‌వాడీలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ హెచ్చరించారు. గత సమ్మె కాలపు ఒప్పందాలకు ఇచ్చిన హామీలు, కనీస వేతనాలు, గ్రాట్యుటీ తదితర సమస్యలు పరిష్కారం కోసం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం కలెక్టరేట్ వద్ద యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ పార్కు వద్ద గల ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో డీఆర్‌ఓకు మురళికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి శాంతమణి అధ్యక్షత వహించిన సభలో ఆంజనేయులు నాయక్, జిల్లా గౌరవాధ్యక్షురాలు జి.మల్లీశ్వరి, డి.శివకుమారి, టి.శ్రీనివాసరావు, రైతు, కౌలు రైతు సంఘాల జిల్లా కార్యదర్శిలు ఏపూరి గోపాలరావు, వై.రాధాకృష్ణ, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఏ.ఎల్.ప్రసన్న మాట్లాడారు. అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, 42 రోజుల చారిత్రాత్మక సమ్మెకు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు నాడు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో సంబంధం లేని కారణాలతో షోకాజు నోటీసులు ఇస్తున్నారన్నారు. ప్రాజెక్టు లీడర్లు బి.నిర్మల, సాయికుమారి, మాధవి, శివపార్వతి, విజయలక్ష్మి, అహల్య, సుజాత, తులసి, పద్మ, రమణ, సావిత్రి, ఉషా 500 మందికి పైగా అంగన్‌వాడీలు పాల్గొన్నారు.


