అర్జీలు నాణ్యతగా పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి
112 అర్జీలు స్వీకరించిన డీఆర్‌ఓ, అధికారులు
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు నాణ్యంగా పరిష్కరించటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌ఓ ఏకా మురళి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అధ్యక్షత వహించి జిల్లా అధికారులతో కలసి 112 అర్జీలు స్వీకరించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ అర్జీలకు సంబంధించిన ఆడిట్‌ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తిచేయాలని, ఇందులో నాణ్యత బాగుండాలన్నారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతివారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్లినప్పుడు గ్రీవెన్‌న్స్ జాబితా సిద్ధంగా ఉంచాలని అధికారులకు చెప్పాలని సూచించారు. ఆర్‌డీఓలు, జిల్లా అధికారులు ఒకటి, రెండు అర్జీలను స్వయంగా తనిఖీ చేయాలన్నారు. దీని ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకుని ఫీడ్‌బ్యాక్ అందించాలని, యాదృచ్ఛికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. తహసీల్దార్‌లు వారి దగ్గరికి వచ్చిన అర్జీలు సరైన విధంగా పరిష్కరించారా అనేది చూడాలని, దీనిపై దృష్టి పెట్టాలని, అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉందన్నారు. జిల్లా అధికారులకు ఈ ఆఫీస్ ద్వారా తపాల్‌లను పంపించడం జరుగుతోందని, రోజువారీగా వాటిని చూసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌డీఓ కె.మధులత, ఇతర అధికారులు పాల్గొన్నారు.


