ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
రూ.26.50 లక్షల బంగారం, వెండి సొత్తు స్వాధీనం తెలుగు రాష్ట్రాల్లో 78కి పైగా కేసులు నమోదు
నగరంపాలెం(గుంటూరువెస్ట్): ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తులతోపాటు దొంగిలించిన సొత్తు విక్రయించి దొంగలకు సహకరించే వ్యక్తిని కూడా గుంటూరు సీసీఎస్, లాలాపేట పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు సంపత్‌నగర్ మెయిన్‌రోడ్డులో ఉంటున్న అవ్వారి వెంకటప్పయ్యశాస్త్రి గత నెల 8న తిరుపతి వెళ్లి 12న ఇంటికొచ్చారు. ప్రధాన ద్వారం తాళాలు పగుల కొట్టి ఉంది. బీరువాలో దాచిన 152 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. బాధితుడు లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శివప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు సీసీఎస్, లాలాపేట పోలీసులు పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు. గుంటూరు మార్కెట్ సెంటర్‌లో సంచరిస్తున్న గోరంట్ల తూర్పుబజార్‌కు చెందిన చిల్లర సురేష్, విజయవాడ రామలింగేశ్వరనగర్ గంగానమ్మ గుడి పక్కన ఉంటున్న కాజా నాగవీరభాస్కరరావులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం ఒప్పుకోవడంతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నాలుగు కేసుల్లో రూ.26.50 లక్షల ఖరీదు చేసే 227 గ్రాముల బంగారు, 182 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ చెప్పారు. దొంగలించిన సొత్తుని విక్రయించి వారికి సహకరిస్తున్న సుగాలినగర్ 4వ వీధికి చెందిన లంకా రాజేష్‌ను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు.


