కుడికాలువలో ఇరువురు గల్లంతు
ఒకరు మృతి.. మరొకరి కోసం గాలింపు
మాచర్ల రూరల్: నాగార్జునసాగర్ కుడి కాలువలో నీటి ప్రవాహానికి ఓ మహిళ కొట్టుకుని పోగా, ఆమెను రక్షించేందుకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని 25వ వార్డులో ధరణికోట శ్రీలక్ష్మి (25) నివసిస్తోంది. అదే వార్డులో వీర్ల గోవర్ధన్ నివసిస్తున్నాడు. శ్రీలక్ష్మి నాలుగు సంవత్సరాల కిందట భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద నివసిస్తుంది. ఆమెకు 7 సంవత్సరాల కుమారుడు, 5 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు మద్యం తాగి కుడికాలువ వద్ద పడి ఉన్నాడని సమాచారంతో శ్రీలక్ష్మి, గోవర్ధన్‌లు కలిసి కాలువ వద్దకు వెళ్లారు. శ్రీనివాసరావును లేపి ఇంటికి పంపించే నేపథ్యంలో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు కాలువలోకి దిగారు. శ్రీలక్ష్మి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు ఒడ్డుపై ఉన్న వీర్ల గోవర్ధన్ కాలువలోకి దూకాడు. అతను కూడా ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కొద్ది దూరంలో చేపలు పడుతున్న కొంతమంది శ్రీలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. గోవర్ధన్ కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు. దీనిపై పట్టణ పోలీసులను వివరణ కోరగా కుటుంబ సభ్యులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
కుడికాలువలో గల్లంతైన వీర్ల గోవర్ధన్ (ఫైల్) , మృతి చెందిన డి శ్రీలక్ష్మి
కుడికాలువలో ఇరువురు గల్లంతు


