రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం
పిడుగురాళ్లరూరల్: ప్రతి క్రీడాకారుడు దేశానికి మంచి పేరు తేవాలని గురజాల డీఎస్పీ జగదీష్ అన్నారు. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ రాష్ట్రస్థాయి ఆటల పోటీలను సోమవారం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించారు. అండర్–14 బాలికలు, అండర్–19 బాలురలకు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు 17 జిల్లాల నుంచి సుమారుగా 350 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యాసంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు క్రీడా జ్యోతిని వెలిగించగా, గురజాల డీఎస్పీ జగదీష్ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ...గెలుపునకు ఓటమి నాందిగా క్రీడాకారులు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ నరేష్, పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, పల్నాడు జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కన్వీనర్ కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా హ్యాండ్ బాల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ షేక్ రాను హుస్సేన్, పీఈటీలు, ఎస్‌ఐలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


