రబీ పంటలపై రైతులకు శిక్షణ
యడ్లపాడు: గ్రామీణ అవగాహన కృషి అనుభవ పథకంలో భాగంగా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు జగ్గాపురంలో గురువారం రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఎం. నగేష్, విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త పీవీ సత్యగోపాల్ హాజరయ్యారు. రైతులకు రబీలో సాగుచేసే శనగ, మొక్కజొన్న పంటలపై మార్గ నిర్దేశం చేశారు.
విత్తన శుద్ధి, తెగుళ్ల నివారణే కీలకం
రైతులకు విత్తన శుద్ధి, తెగుళ్లు, పురుగుల నివారణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. శనగలో ఎండు తెగులు నివారణకు విత్తన శుద్ధిలో కార్బెండజం కిలో విత్తనానికి 2.5 గ్రాములు, ఆ తర్వాత ట్రైకోడెర్మా పొడి కిలో విత్తనానికి 10 గ్రాములు వాడాలని సూచించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి, ప్రారంభ దశలో వేప నూనెను వాడటం ద్వారా పంటను కాపాడుకోవచ్చని తెలిపారు.
మెరుగైన దిగుబడికి యాజమాన్య పద్ధతులు
శనగ పంట యాజమాన్యంలో భాగంగా 30–35 రోజులకు, 60–65 రోజులకు నీటి తడి ఇవ్వడం ద్వారా దిగుబడి 2–3 క్వింటాళ్లు పెరుగుతుందని, సకాలంలో కలుపు నివారణ ముఖ్యమని సూచించారు. శనగకు ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్‌ను చివరి దుక్కుల్లో వేసుకోవాలని తెలిపారు. శనగపచ్చ పురుగు, ఆకు మాడు, తుప్పు తెగుళ్ల నివారణకు మందుల వాడకాన్ని వివరించారు. విద్యార్థినులు కీర్తి, శ్రీనిధి, జోషిత, శ్రేయ, అనగాని బేబీ, విజయలక్ష్మి, గాయత్రి, జ్యోత్స్నలు శనగపై తాము తయారుచేసిన పోస్టర్లను ప్రదర్శించి, రైతులకు వివరించారు. అభ్యుదయ రైతు పోపూరి శివరామకృష్ణ సహా దాదాపు 50 మంది రైతులు కార్యక్రమంలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


