బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
నరసరావుపేట రూరల్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) సత్తిరాజు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలు రూపుమాపుతామంటూ పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపేందుకు అందరూ కట్టుబడి పనిచేయాలని తెలిపారు. బాల్య వివాహాలు ఆడపిల్లల భవిష్యత్తును దెబ్బతీయడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. వాటిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. బాలికలకు విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, వెల్ఫేర్ ఆర్‌ఐ ఎల్.గోపీనాథ్, అడ్మిన్ ఆర్‌ఐ ఎస్.కృష్ణ, ఎంటీ ఆర్‌ఐ యువరాజు పాల్గొన్నారు.


