29 నుంచి పల్నాడు బాలోత్సవం
నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30వ తేదీలలో మూడవ పిల్లల పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బాలోత్సవం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మస్తాన్ షరీఫ్, కట్టా కోటేశ్వరరావు వెల్లడించారు. బుధవారం కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ చిన్నారులలో సృజనాత్మకత, దేశభక్తి, అభ్యుదయ భావాలు పెంచేలా దీన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే పోటీలలో జిల్లా వ్యాప్తంగా 200కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో పోటీలు ఉంటాయని తెలిపారు. కోలాటం, శాసీ్త్రయ నృత్యం, లఘు నాటికలు, బుర్రకథ, విచిత్ర వేషధారణ వంటి మొత్తం 69 అంశాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరారు. పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు. ఈ సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరించారు. బాలోత్సవం కోశాధికారి కోయా రామారావు, కమిటీ సభ్యులు నెల్లూరు బ్రహ్మయ్య, కోటా సాయి కుమార్ పాల్గొన్నారు.


