అటవీ శాఖ అనుమతులు త్వరితగతిన పొందాలి
నరసరావుపేట: పీఎం జన్‌మన్ పథకం ద్వారా చెంచుల నివాసాల్లో 11 రకాల మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు పొందాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం పీఎం జన్‌మన్ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో తాగునీటి పైప్‌లైన్లు, మొబైల్ టవర్లు నిర్మాణాల కోసం అనుమతులు పొందే విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇప్పటికే మంజూరైన 763 ఇళ్ల నిర్మాణాలను మార్చి నాటికి పూర్తిచేసి తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 15 రోజుల్లోగా చెంచుల నివాసాల్లో సర్వేచేసి ఇళ్లులేని కుటుంబాలు, తాగునీటి సరఫరా పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని చెప్పారు. పీఎం జన్‌మన్‌కు కొనసాగింపుగా అమలు చేయనున్న డీఏ జువా (ధర్తీ అబా జన్ బాగీదారీ అభియాన్) పథకంలో భాగంగా గిరిజన నివాస ప్రాంతాల్లో 25 రకాల వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు అన్ని శాఖలతో కమిటీ నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా


